అమరావతిని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులని, వైసీపీ పార్టీ నేతలు ఎలా హేళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అమరావతిని భ్రమరావతి అంటూ జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, అమరావతిని హైమావతి అని ఒకరు, అమరావతిని స్మశానం అని ఒకరు, అమరావతిలో పందులు తిరుగుతాయని ఒకరు, అమరావతి ఎడారి అని ఒకరు, ఇలా ఇష్టం వచ్చినట్టు హేళన చేసారు.ఇక అలాగే, అమరావతి రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అని, ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమాలు చేస్తున్నారని, కాస్ట్లీ రైతులు అని, వాళ్ళ చేతిలో ఫోన్ లు ఉన్నాయి, చేతికి వాచీలు ఉన్నాయి, వీళ్ళు రైతులా అని, ఇలా ఇష్టం వచ్చినట్టు హేళన చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అయితే, రైతులు బురదలో దొరికేది తినాలి అంటూ, నాలుగు రోజులు కిందట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నా, ఒక్కరు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఇలా చెయ్యకూడదు అని చెప్పగపోగా, ఎదురు రెచ్చగొడుతున్నారు.
ఈ నేపధ్యంలోనే, ఎప్పుడో నాలురు రోజుల క్రిందట పృధ్వీ చేసిన వ్యాఖ్యలను, ఈ రోజు పోసాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. అది కూడా హడావిడిగా, సాయంత్రం 8 గంటలు దాటిన తరువాత వచ్చి, ఖండించారు. ఇంత హడావిడిగా రాత్రి పూట ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ప్రెస్ మీట్ మొదలు పెట్టటంతోనే, పృధ్వీ రైతులని ఇలా మాట్లాడటం చాలా తప్పు అని, 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని ప్రశ్నించారు. పృధ్వీ వెంటనే రైతులకి క్షమాపణ చెప్పాలని, పోసాని డిమాండ్ చేసారు. పృథ్వీలాంటి వాళ్ల వల్లే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని, గాడు అంటూ అమరావతిలో బూతులు తిడుతున్నారని అన్నారు.
అంతే కాదు, రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అని చెప్తున్న మంత్రుల్ని , ఇతరుల పై కూడా పోసాని ఫైర్ అయ్యారు. మహిళలు రెండు బంగారు గాజులు వేసుకొనేందుకు కూడా అర్హులు కాదా? రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని అన్నారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఆవేదన అర్ధం చేసుకోకుండా, అక్కడ అంతా ఒకే కులం అంటూ, ఇంకో ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి పోసాని ఎందుకు ఇలా మాట్లాడారు. 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడో నాలుగు రోజులు క్రిందట పృధ్వీ చెప్పిన దాన్ని ఖండించటం ఏమిటి ? అంతకు ముందు నెల రోజులు నుంచి, మంత్రులు ఇలా మాట్లాడుతుంటే, పోసాని ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్నలు మాత్రం, వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నిమిషానికి, అమరావతి రైతుల పక్షాన ఎవరు నుంచున్నా అభినందించాల్సిందే.