రాజధాని అమరావతి పరిరక్షణతోనే ఏపిలో బీజేపీ భవితవ్యం ముడిపడి ఉందని ఆ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో పటిషమైన పునాదులు నిర్మించుకునేందుకు అమరావతి పరిరక్షణ రూపంలో ఒక సువర్ణావకాశం బిజెపి ముంగిటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నిఘావర్గాలు సైతం ఇదే విషయాన్ని ఢిల్లీ వర్గాలకు చేరవేసినట్లు వినికిడి. దీంతో అమరావతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తుంది. రాజధాని అమరావతి మార్పు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అంచనా వేసేందుకు బీజేపీ అధిష్టానం కేంద్రం మంత్రి సదానంద గౌడను దూతగా పంపించనున్నట్లు బీజేపీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతుంది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ ఈనెల 12వ తేదీన గుంటూరు రానున్నారు. సిఏఏ సదస్సు పేరిట గుంటూరు కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమానికి సదానంద గౌడ హాజరవుతారని బీజేపీ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. అయితే 12వ తేదీ మధ్యాహ్నం సదానందగౌడ నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి చేరుకుంటారు.
ఆ సమయంలో రాజధాని పరిణామాలపై అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వినికిడి. రాజధాని ప్రాంతానికి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు కేంద్రమంత్రిని కలుసుకునేందుకు ఏర్పాటు జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతూ బిజెపి రాష్ట్ర శాఖ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఆ యోచనతోనే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 11వ తేదీన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సంసాగత ఎన్నికలులో పార్టీ యంత్రాంగమంతా తలమునకలు అయి ఉన్న తరుణంలో ప్రత్యేకించి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సందరించుకుంది. సమావేశంలో తీర్మానం అనంతరం పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ ధియోదర్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని జాతీయ నాయకత్వ వద్దకు పంపించాలని బిజెపి తలపోస్తోంది.
గతంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసిన తరహాలోనే తాజా పరిణామాల నేపధ్యంలో ఒక రాష్ట్రం ఒక రాజధాని' అని తీర్మానం చేయాలని భావిస్తున్నారు. అయితే పార్టీ విధానాన్ని అనుసరించి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర నాయకత్వాన్ని కోరే అవకాశముంది. ఈ నేపధ్యంలోనే గతంలో పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ గా వ్యవహరించిన ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సిద్ధార్థ నాదసింగ్ వ్యాఖ్యలు అమరావతి రైతాంగంలో ఆశలు రేకెత్తించింది. 75 జిల్లాలు ఉన్నా ఉత్తరప్రదేశ్ కు ఒకే రాజధాని ఉంది. అక్కడి నుంచే ఎంతో సమర్థవంతంగా పాలన జరుగుతుంది. ఆంధ్ర నుంచి అధికారులు వస్తే అక్కడకు తీసుకువెళ్ళి చూపిస్తాం అని సిద్ధార్థ నాద్ వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించటమే గాక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై పట్టు ఉన్న సిద్ధార్థ నాద్ సింగ్ ఈ తరుణంలో రాష్ట్రానికి రావడం బీజెపి వ్యూహంలో భాగంగానే
భావిస్తున్నారు.