ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే హాట్ టాపిక్ అయ్యింది, మన రాష్ట్రంలో మూడు రాజధానుల పరిస్థితి. సౌత్ ఆఫ్రికా మోడల్ అంటూ, దేశంలో ఎక్కడా లేని విధానాన్ని జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. అందరూ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేస్తే చాలు, అన్నట్టు, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని, కర్నూల్ లో హైకోర్ట్ అని, అమరావతిలో అసెంబ్లీ అని మూడు రాజధానుల గురించి ప్రతిపాదించారు. ఇదే విషయం పై ప్రభుత్వం నిర్ణయంచిన జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది. జగన్ చెప్పినట్టే, జీఎన్ రావు కమిటీ కూడా చెప్పింది. ఇప్పుడు మరో కమిటీ అయిన బోస్టన్ కమిటీ, అలాగే ఇది వచ్చిన తరువాత హై పవర్ కమిటీ నిర్ణయం పై, మూడు రాజధానులు విషయం అధికారికం కానుంది. అయితే ఈ నిర్ణయం సరైన నిర్ణయం కాదని, దీని వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని, ముఖ్యంగా ఒక మంచి ఆదాయాన్ని ఇచ్చే రాజధాని లేని రాష్ట్రంగా, ఏపి మిగిలిపోతుందని, మేధావులు చెప్తున్నారు.
ఇప్పటికే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, ఈ విషయం పై, 13 రోజులుగా నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే, ఈ మూడు రాజధానుల విషయం పై, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన ఈ రోజు ఆస్క్ కేటీఆర్ అంటూ ట్విట్టర్ లో ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రజలు తమకు కావాల్సిన ప్రశ్నలు, తమకు ఎదురు అవుతున్న సమస్యలు అడగాలని కేటీఆర్ ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ క్రమంలో, కేటీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న, మూడు రాజధానుల విషయం పై, మీ అభిప్రాయం ఏమిటి, ఒక తెలంగాణా వాదిగా కాకుండా, సమాధానం చెప్పండి అంటూ, ఓకే నెటిజెన్ ప్రశ్న అడగగా, దానికి కేటీఆర్ స్పందిస్తూ, సమాధానం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని రాజధానులు ఉండాలి అనేది, తను కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే దానికి సమాధనం చెప్పగలరు అంటూ, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. వేరే ప్రశ్నకు, జగన్ ఎలా పరిపాలుస్తున్నాడు అని అడగగా, హీ స్టార్ట్డ్ వెల్ అంటూ సమాధానం చెప్పారు. అలాగే వివిధ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నిన్న మరో టీఆర్ఎస్ మంత్రి, హరీష్ బావ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితి ఉందొ తెలుసు, అది కూడా మన హైదరాబాద్ కు కలిసి వచ్చింది అంటూ, నవ్వుతూ, చెప్పిన సంగతి తెలిసిందే. అక్కడ వాతావరణంతో, హైదరబాద్ కు బాగా కలిసి వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్, మూడు రాజధానుల పై సమాధానం ఏపి ప్రజలే చెప్పాలి అంటున్నారు.