అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలి అంటూ, గత ఎనిమిది రోజులుగా అమరావతిలోని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతులు వారి ఆందోళనలు ప్రశాంతంగా చేస్తున్నారు. ఎక్కడా లైన్ దాటలేదు. శాంతిబధ్రతలు అదుపు తప్పకుండ, ఎంత భావోద్వేగం ఉన్నా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు రాజధాని రైతులకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఈ నెల 27న ఆందోళనలు చెయ్యవద్దు అంటూ, పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిఎం, మంత్రులు, సచివాలయానికి వెళ్ళే దారిలో ఎలాంటి ఆందోళనలు చెయ్యవద్దు అంటూ, హెచ్చరించారు. అంతే కాదు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరూ ఊళ్ళలో ఉండకూడదు అని, ఒక వేల ఎవరైనా వస్తే, తమకు చెప్పాలి అంటూ, పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీని అంతటికీ కారణం, ఈ నెల 27న వెలగపూడిలోని సచివాలయంలో, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అనే సమాచారం రావటమే.
అయితే విశాఖపట్నంలో, క్యాబినెట్ సమావేశం జరుగుతుంది అని ప్రచారంలో ఉన్నా, ఇప్పుడు పోలీసులు ఇచ్చిన నోటీసులు చూస్తుంటే, క్యాబినెట్ సమావేశం, అమరావతిలోని జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే, పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే, ఇలా అందరికీ నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. రైతులు గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, వాళ్ళు, ఎక్కడ జగన్ మోహన్ రెడ్డిని, మిగిలిన మంత్రులను అడ్డుకుంటారేమో అనే అనుమానంతోనే, పోలీసులు ముందస్తుగానే రైతులకు నోటీసులు ఇచ్చారు. అయితే, కొంత మంది ఆక్టివ్ గా ఉన్న వారిని రేపు సాయంత్రం నుంచి, అదుపులోకి తీసుకునే అవకాసం ఉందని, రైతులు అనుకుంటున్నారు.
పోలీసులు తీరుని రైతులు తప్పు బడుతున్నారు. మేము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని, తమకు నోటీసులు ఇచ్చి, ఆందోళన చెయ్యవద్దు అంటూ చెప్పటం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మేము ఆందోళన చేసి తీరుతామని, తమ ఆవేదన చెప్పుకోవటానికి, ఈ ఆరు నెలల్లో ఒక్కసారిగా కూడా, జగన్ మోహన్ రెడ్డి తమకు పర్మిషన్ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసన ప్రతి రోజు లాగే కొనసాగిస్తామని, అలాగే 27న కూడా కొనసాగిస్తామని, పోలీసులు నిబంధనలు లోబడే ఆందోళన చేస్తామని, ఎవరినీ ఇబ్బంది పెట్టమని, తమ ఆందోళనను అడ్డుకోవద్దు అంటూ, రైతులు వాపోతున్నారు. క్యాబినెట్ సమవేశంలో, రాజధాని పై నిర్ణయం తీసుకునే, నేపథ్యంలో రాజధాని రైతులు ఆందోళనను మరింత ఉద్ధృతం చేసేఅవకాశముందని భావిస్తున్న పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.