రాష్ట్రంలో మూడు రాజధానుల రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అమరావతి ప్రజలు ఆందోళన చేస్తుంటే, విశాఖ ప్రజలు అనుమానంగా, భయం భయంగా చూస్తూ, మేము ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, ఈ గోల ఎందుకు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక కర్నూల్ విషయానికి వస్తే, హైకోర్ట్ వస్తుందని సంతోషంగా ఉన్నా, సచివాయలం వెళ్ళాలి అంటే, వైజాగ్ దాకా వెళ్ళాలా అనే ఉద్దేశంతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయం పై, ప్రముఖ రాజకీయవేత్త సబ్బం హరి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, "విశాఖను రాజధానిగా ప్రకటించడంలోనే పచ్చిమోసం ఉంది. జగన్ ప్రకటనతో విశాఖకు పెనుముప్పు రానుంది. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. విశాఖలో రెండు భవనాలు కట్టడం తప్ప ఏమీ చేయలేరు. విశాఖలో సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. గత ఐదేళ్లలో విశాఖకు చాలా ఐటీ సంస్థలు వచ్చాయి. విశాఖను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు."
"గత ఆరు నెలలుగా భీమిలిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఖాళీగా ఉన్న భూముల్ని దోపిడీ చేసేందుకు కుట్ర. 15 రోజుల్లో ఆధారాలతో సహా దోపిడీని నిరూపిస్తా. విశాఖలో ఇప్పటికే రౌడీమూకలు దిగాయి. ప్రభుత్వం నోటిపై చేసిన భూముల్ని స్వాహాచేసే కుట్ర. గతంలో 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో జగన్ అన్నారు. విశాఖలో ఐదు వేల ఎకరాలు కూడా సేకరించలేరు. అమరావతిలో భూముల్ని కబ్జా చేయలేరు కాబట్టే.. కొత్త ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకున్నారు. విశాఖలో వైసీపీ నేతల ఆటలు సాగవు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఎందుకు నిరూపించలేదు. ఒక్కటైనా నిరూపిస్తే జగన్ను ప్రజలు నమ్మేవారు. కేసీఆర్తో కలిసి విభజన హక్కులు సాధిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్కటైనా సాధించారా?. "
"చంద్రబాబు అవినీతికి పాల్పడితే జైలులో పెట్టండి. జీఎన్రావుది అసలు కమిటీయే కాదు. హైదరాబాద్ నుంచి ఒకరిని చెన్నై మరొకరిని తీసుకొచ్చి కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ ఉన్నతమైనది. రాజకీయకక్షల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. జగన్ ఏడు నెలలుగా పనిచేసి ఉంటే భవనాలన్నీ పూర్తయ్యేవి. అభివృద్ధి పనులను పక్కనబెడుతున్నారు. రాష్ట్రంలో పరిణామాలను చూసి బాధపడుతున్నా. మంత్రులు పూటకో అబద్ధం మాట్లాడుతున్నారు. ఏడాదిన్నరపాటు అమరావతి నిర్మాణాన్ని వైసీపీ అడ్డుకుంది. ఇప్పుడు ఏపీకి కావాల్సింది ప్లాన్డ్ సిటీ. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డ్రామా. అభియోగాలను నిరూపించలేని అసమర్థ ప్రభుత్వమా ఇది. డబ్బులిచ్చి కొనుకున్న భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ అనడం ఏంటి?. వైసీపీ నేతలు మూర్ఖులు.. ఏం చెప్పినా వినరు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అవాస్తవం" అంటూ సబ్బం హరి చెప్పుకొచ్చారు.