మూడు రాజధానుల ప్రకటన అనంతరం అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తోంది. గతంలో రాజధాని భూసమీకరణ సందర్భంగా భూములిచ్చిన రైతులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో మార్పులు చేయడం, పరిహారాల పెంపుతో పాటు మరికొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది అంటూ లీకులు ఇస్తున్నారు. ఈ నెల 27న జరిగే కేబినెట్ భేటీలో వీటిపై చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. ఏపీ రాజధాని వ్యవహారం రోజు రోజుకూ ఊపందుకోవడంతో, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన నేపధ్యంలో, వారిని శాంతింప చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మూడు రాజధానుల ప్రకటనను తర్వాత అమరావతి పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగబోతుందన్న అంశం పై ఓరోడ్ మ్యాప్ తయారుచేసి క్లారిటీ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమట.
అదే సమయంలో గంతలో తెదేపా ప్రభుత్వం రైతులకు ప్రకటించిన ప్యాకేజీలో భారీగా మార్పులు చేయడంతోపాటు వారికి మరిన్ని వరాలు ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన ఇక్కడి రైతు కుటుంబాల్లో పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా గత ప్రభుత్వం ప్రకటనలు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతులకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ పెంపు, అనుబందంగా మరికొన్ని వరాల ప్రకటనతో పటు అవసరమైతే విశాఖలో సైతం భూములు కేటాయింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో రైతు కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కచ్చితంగా అందేలా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది.
మరోవైపు అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా వాడుకోవాలంటూ జీఎన్ రావు కమిటీ చేసిన సూచనల మేరకు ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు కేటాయించే అంశం పై కూడా ప్రకటన చేస్తారు అంట. అసెంబ్లీ కూడా వెలగపూడి నుండి మంగళగిరి వైపునకు తరలిపోతే దాన్ని కూడా జాతీయ విద్యాసంస్థలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా అమరావతి అభివృద్ధికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనే హామీ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. 27 న జరిగే కేబినెట్ భేటీలో మంత్రుల సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత దీనిపై తుది ప్రకటన చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజధాని రైతులు ఇవన్నీ నమ్ముతారా ? వారు చేస్తున్న ఆందోళన రాజధాని కోసం అయితే, వీళ్ళు పరిహారం ఎంత పెంచినా, ఆ భూములు దేనికి ఉపయోగ పడతాయి ? చూద్దాం ప్రభుత్వం ఏమి చేస్తుందో ? రైతులు ఏమంటారో ?