అమరావతి పై వైసీపీ పార్టీ, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎందుకో కాని, మొదటి నుంచి అమరావతి పై ద్వేషం చూపిస్తూనే వచ్చారు. అమరావతి శంకుస్థాపనకు నేను రాను అని చెప్పిన దగ్గర నుంచి మొదలైన ద్వేషం, ఈ రోజు అమరావతికి భూములు ఇచ్చిన రైతులను రోడ్డున పడేసా దాకా వచ్చింది. ఈ మధ్యలో అమరావతిని హేళన చేస్తూ, వైసీపీ నేతలు అనేక రకాలుగా మాట్లాడారు. అమరావతిని భ్రమ్రావతి అన్నారు. అమరావతిని హైమావతి అన్నారు. అమరావతి స్మశానం అన్నారు. అమరావతిని ఎడారి అన్నారు. అమరావతిలో పందులు తిరుగుతాయి అన్నారు. ఇలా అమరావతి ప్రాంతాన్ని అవమానించారు. ఇవన్నీ అక్కడ ప్రజలు భరించారు. అయితే, ఇప్పుడు అక్కడ నుంచి రాజధాని వెళ్ళిపోతుందని, తమ భూములు సంగతి ఏమిటి అంటూ, అక్కడ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతుల పై కూడా, వైసీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.
నిన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో, రాజధాని రైతుల పేరిట జరుగుతున్న ఆ ఉద్యమం ఒక బోగస్ అని, అందులో ఉన్నవారంతా టీడీపీ కార్యకర్తలేనని అన్నారు. రాజధానిలోని లింగులింగుమంటూ ఉన్న ఓ 8 ఊరోళ్లు మాత్రం గొప్ప పోరాటం అంటూ బిల్డప్ ఇస్తున్నారని అవహేళన చేసారు. పేపర్ లో తమ బొమ్ములు పడతాయని, వాటి అలా చుసుకునేందుకే, వీళ్ళు ఇలా హడావిడి చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో తమకు లేని పోరాటం, మీకెందుకు అంటూ అమరావతి రైతులను ఎద్దేవా చేశారు. ఈ ఉద్యమాల పేరుతొ పప్పులేం ఉడకవని, అమరావతి రైతుల ఉద్యమం బోగస్ అని ధర్మాన అన్నారు.
అయితే, ఈ రోజు ధర్మానకు సంబధించి ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆడియోలో ధర్మాన, అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్తున్నట్టు ఉంది. ఈ వీడియో కొన్ని టీవీ చానల్స్ కూడా ప్లే చేసాయి. ఆ సంభాషణ ఇలా ఉంది. "యువకుడు: సర్...నమస్తే...బాగున్నారా సర్.... ధర్మాన: బాగున్నానండి.... యువకుడు: సర్ అది...నిన్న మీరు..దాంట్లో లింగులింగుమనే మాట బాగోలేదు సర్. ఇబ్బందికరంగా ఉంది.... ధర్మాన: మీకు నచ్చలేదు కదా?.. క్షమించేయండి. విజయవాడ వచ్చినప్పుడు కలుద్దాం. నమస్కారం." అంటూ ఈ ఫోన్ సంభాషణ కొనసాగింది. ధర్మాన లాంటి సీనియర్ నాయకులు కూడా, ఇలా ఒక ప్రాంతాన్ని కించ పరుస్తూ వ్యాఖ్యలు చెయ్యటం పట్ల, విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.