ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎంత మంది మీడియా, ప్రెస్ వాళ్ళు నిరసనలు చేసినా, పార్టీలు నిరసన తెలిపినా, అసెంబ్లీలో చర్చ జరిగినా, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులు, ఇబ్బందిగా మారాయి. మీడియా పై ఆంక్షలు పెడుతూ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, ప్రభుత్వాన్ని కించ పరిచే నిరాధార వార్తలు రాస్తే, కేసులు పెట్టండి అంటూ, అన్ని శాఖలకు అధికారం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 ని రిలీజ్ చేసింది. అయితే ప్రభుత్వం చేత ఈ జీవో ఉపసంహరించుకునేలా చెయ్యాలి అంటూ, వేసిన పిటీషన్ పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా వాదనలు జరిపి, మీడియాపై ఆంక్షలు విధించేలా ఉన్న ఆ జీవో ఉప సంహరించుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఇచ్చిన ఈ ఆదేశాల పై వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియాకి ధన్యవాదాలు చెప్పాయి.
ఈ విషయం పై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ అధ్యక్షతన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో, ఈ అంశం పై విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ జర్నలిస్టు సంఘ నేతలు, ఈ విచారణలో పాల్గొని, తమ వాదనలు వినిపించారు. ఈ జీవో, తమ విధులకు ఇబ్బంది కరంగా మారిందని, వాదనలు విపించారు. ఇప్పటికే తప్పుడు వార్తల పై వివిధ చట్టాలు ఉన్నాయని, ఇప్పుడు ఇలాంటి జీవో ఇచ్చి, తమకు ఇష్టం లేని వాళ్ళ పై, ప్రభుత్వం కక్ష సాధించే కుట్ర ఉందని, ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. వార్తా నిజమా కదా, అని, లేకపోతే, ప్రభుత్వం తప్పు చేసిందా లేదా అని ఎవరు నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందని అన్నారు.
గతంలో జయలలిత ప్రభుత్వంలో, ఇలాగే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తు చేసారు. అయితే ఈ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున, సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్ కిరణ్ వచ్చి, ప్రభుత్వం తరుపున వాదనలను వినిపించారు. ఈ జీవో తేవటం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఈ జీవోని దుర్వినియోగం చేయబోమని చెప్పారు. కేవలం కావాలని, తమ పై బురద జల్లే వార్తల నియంత్రణ కోసమే ఈ జీవో తెచ్చామని, ఏ ఒక్కరినీ టార్గెట్ చేసి కాదని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చామని చెప్పారు. అయితే ఇరువురి వాదనలు ఉన్న కౌన్సిల్, ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ను ఉప సంహరించుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ఆదేశించారు. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.