అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానులు అంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పై, అమరావతి రైతులు నాలుగో రోజు ఆందోళన చేస్తున్నారు. నిన్న జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ఇస్తూ, జగన్ చేసిన ప్రకటనే వీళ్ళు కూడా చెయ్యటంతో, అమరావతి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిన్నే సచివాలయం ముట్టడికి వెళ్ళిన రైతులు, అక్కడ టైర్లు తగలబెట్టి, జగన్ ఫ్లెక్స్ లు చించేసి, ఆందోళన చేసారు. ఈ రోజు ఉదయమే ఆందోళను మొదలయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి పాలనను, దున్నపోతుతో పోల్చుతూ, రైతులు దున్న నుంచి పాలు తీస్తున్నట్టు చూపించారు. దున్నపోతు పాలన అంటూ, నినాదాలు చేసారు. ఇక మందడం రైతులు తమ ఆందోళనను ఉధృతం చేసారు. మందడం మెయిన్ సెంటర్ దగ్గర రోడ్డుకు అడ్డుగా కట్టారు. ప్రధాని మోడీ ఫోటోలతో ఫ్లెక్సీలను రైతులు ఏర్పాటు చేశారు. అలాగే రైతులు మందడం మెయిన్ సెంటర్‌లో రిలే నిరాహారదీక్షలకు కూరుచున్నారు. అమరావతిని ఇక్కడే ఉంచాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే, వెలగపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెలగపూడి పంచాయతీ కార్యాలయానికి రైతులు నల్ల రంగు పూసి నిరసన తెలిపారు. ఇది మా పంచాయతీ కార్యాలయం అని, దీనికి ఒక పార్టీ రంగులు ఎలా వేస్తారు అంటూ ఆందోళన బాట పట్టారు. నల్ల రంగు డబ్బాలతో, వైసీపీ రంగులు అన్నీ చెరిపేసి, నల్ల రంగు పూసారు. పోలీసులు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా, వారు లెక్క చెయ్యకుండా, నల్ల రంగు పూసారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తమని పట్టించుకోని కార్యాలయానికి, తమ నిరనస తెలియ చేస్తున్నామని, అందుకే నల్ల రంగు పుస్తున్నామని రైతులు అంటున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా వచ్చే రోజు ఎంతో తొందరలో లేదు అని, రైతులు అన్నారు.
అలాగే, మంగళగిరి మండలం కోరగల్లులోనూ రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతులు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు పై ఆందోళన చేస్తున్నారు. నీరుకొండ కొండవీటివాగు వంతెన పై కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. తుళ్లూరులో మహాధర్నా చేస్తున్న రైతులు వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి, తమ జీవితాలను తారు మారు చేసేసాడని, ఇతన్ని గెలిపించి, తమ నెత్తి మీద, తామే బండ పెట్టుకున్నామని రైతులు వాపోతున్నారు. తమ జీవితాలు బాగు చేస్తాడు అనుకుంటే, నాశనం చేస్తున్నాని వాపోతున్నారు.