ఒక పక్కన, మూడు రాజధానులు అంటూ, వివిధ ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వం చిచ్చు పెట్టి, చలి కాచుకుంటుంటే, మరో పక్క హైకోర్ట్ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస షాకులు ఇస్తుంది. ఒకే రోజు రెండు అంశాల పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ప్రభుత్వాన్ని తప్పు బట్టింది. దీంతో ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ముందుగా ఒక అంశం తీసుకుంటే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. ఈ పీపీఏల విషయం పై, గత ఆరు నెలలుగా రచ్చ నడుస్తూనే ఉంది. చంద్రబాబు మీద కోపంతో, ఇన్వెస్టర్స్ ని ఇబ్బంది పెట్టద్దు అంటూ ట్రిబ్యునల్ చెప్పినా, కోర్ట్ చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం వారి మాట వినకుండా ముందుకు వెళ్తుంది. చివరకు జపాన్ ప్రభుత్వం కూడా, కేంద్రానికి ఉత్తరం రాసి, ఇలా అయితే మీ దేశంలోనే పెట్టుబడి పెట్టం అంటూ, చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పీపీఏల విషయంలో కొన్ని కంపెనీలు కోర్ట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. తమ వద్ద నుంచి ప్రభుత్వం విద్యుత్ తీసుకోవటం లేదు, అంటూ వారు కోర్ట్ కు వెళ్లారు.
దీని పై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ట్ చెప్పినా, ఎందుకు విద్యుత్ కొనటం లేదు అంటూ, ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, పాత బకాయిల కింద వెంటనే పీపీఏలకు రూ.1400 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోర్ట్ ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ వెంకటరమణలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ రూ.1400 కోట్లు ప్రభుత్వం ఎలా ఇస్తుందో చూడాలి. ఇప్పటికే ఆదాయం లేక, కేవలం అప్పుల మీదే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరు నెలల్లో 33 వేల కోట్లు అప్పు చేసారు అంటే, మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మరి,కోర్ట్ చెప్పినట్టు, ఈ రూ.1400 కోట్లు వెంటనే చెల్లించాలి అంటే, ప్రభుత్వం ఏమి చేస్తుందో మరి.
ఇక జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్తున్న ఇంగ్లీష్ మీడియం పై కూడా కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో, ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టం పై, బీజేపీనేత సుదీష్ రాంబొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పై హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ జీవో నిలుపుదల చెయ్యాలి అంటూ కోర్ట్ లో వాదనలు వినిపించారు. అలాగే మీడియంని ఎంపిక చేసుకునే హక్కు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని పై హైకోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లీషు మీడియం పుస్తకాలను ప్రింట్ చేయవద్దని, ఒకవేళ ప్రింట్ చేస్తే, ఆ ఖర్చు అధికారుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిస్తూ, తదుపరి విచారణ జనవరి 27కి వాయిదా వేసింది.