గృహ నిర్బంధాలను, అక్రమ అరెస్ట్ లను ఖండించిన చంద్రబాబు. వైసిపి ప్రభుత్వ దమనకాండపై పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తిన చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ నాయకులను, జెఏసి నేతలను గృహ నిర్బంధాలు చేయడం, అక్రమ అరెస్ట్ లు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండిపడ్డారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో వైసిపి ప్రభుత్వ దమనకాండపై ధ్వజమెత్తారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన నేపథ్యంలో అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఎవరికి వారు తమ భవిష్యత్తుపై ఆందోళనతో ప్రభుత్వానికి తమ ఆకాంక్షలను తెలియజేయాలని అనుకున్న తరుణంలో ఈ విధమైన అణిచివేత చర్యలు చేపట్టడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్దం. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా దేశంలో ఇంత నిర్బంధం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందంటూ, పౌరుల ప్రాధమిక హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు.
రాజ్యాంగం మౌలిక సూత్రాలను కాలరాసేలా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరించడాన్ని గర్హించారు. ‘‘రోడ్డు పక్కన వేసుకున్న టెంట్లను పీకేయడం, మహిళలను సాయంత్రం 6గం తరువాత పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం, లాఠీలతో తీవ్రంగా గాయపర్చడం, ఆడబిడ్డల కడుపులో బూటుకాళ్లతో తొక్కడం, పసిబిడ్డలపై చేయి చేసుకోవడం, రైతులను, రైతుకూలీలను జైళ్ళకు పంపడం, మహిళలపై తప్పుడు కేసులు పెట్టడం...వైసిపి అరాచకాలకు అంతే లేకుండా పోయింది’’. ‘‘గతంలో టిడిపి ప్రజా ప్రతినిధి బృందంపై వైసిపి కార్యకర్తలు రాళ్లు వేసినప్పుడు, వాళ్లకు నిరసన తెలిపే హక్కు ఉందని ఇదే డిజిపి ప్రకటించిన విషయాన్ని రాష్ట్ర పోలీసులంతా గుర్తుంచుకోవాలి."
"అది కేవలం వైసిపి వాళ్లకే కాదు భారత పౌరులు అందరికీ రాజ్యాంగం కల్పించింది. చట్టం వైసిపి వాళ్లకోలాగా, ఇతరులకోలాగా వర్తింపచేయడం సరికాదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ‘‘రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జెఏసి పిలుపు మేరకు సోమవారం జరిగే ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసు బలంతో అడ్డుకోవడం సరికాదు. తక్షణమే గృహ నిర్బంధాలను ఎత్తివేయాలి. అక్రమ అరెస్ట్ లను నిలిపివేయాలి.’’ నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.