రేపటి అసెంబ్లీ సమావేశాల కోసం, పోలీసులు కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పలు పార్టీలు, రైతులు, అమరావతి జేఏసీ , అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వటంతో, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ నేతలను, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో, తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని హౌస్ అరెస్ట్ చెయ్యటానికి, పోలీసులు, ప్రయత్నం చేసారు. రేపటి అసెంబ్లీ ముట్టడికి చింతమనేని వెళ్ళకుండా, ముందు జాగ్రత్తగా పోలీసులు ఆయన నివాసానికి చేరుకొని, హౌస్ అరెస్ట్ చెయ్యాలని అనుకున్నారు. దీంతో చింతమనేని నివాసానికి, భారీగా పోలీసులు వచ్చారు. అయితే, అప్పటికే చింతమనేని పోలీసుల కళ్లుగప్పి తన నివాసం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చింతమనేని ఎక్కడకు వెళ్ళారో కనుక్కోవటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మన్రో పక్క, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జెఏసి చేస్తున్నఆందోళనలకు మద్దతుగా తాడికొండ శివారు గ్రామం బడేపురం గ్రామస్థులు రూ.1,00,116విరాళం అందించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బడేపురం మహిళలు మాట్లాడుతూ రాజధాని పరిరక్షణ కోసం రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. భూములిచ్చి రోడ్లపాలైన ఆ కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని అన్నారు. లాఠీదెబ్బలకు భయపడకుండా, అక్రమ కేసులకు బెదరకుండా వారు చేస్తున్న ఆందోళనలు ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ జెఏసి పిలుపు మేరకు జరుగుతున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది 5కోట్ల ప్రజల జీవన్మరణ సమస్య అంటూ ఏ ఒక్కరి కోసమో చేస్తున్న ఉద్యమం కాదని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు.
అమరావతిని కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని, మన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే రాష్ట్రానికి భవిష్యత్తులో పెట్టుబడులు రావని ఆవేదన చెందారు. ఒక వ్యక్తి చేస్తున్న చెడు ఫలితంగా రాష్ట్రం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నప్పుడు ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని, నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని అన్నారు. చెడు జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన పోరాడటం ప్రతిఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులు, రైతుకూలీలు, కార్మికులు, మహిళలు, యువతరంపైనే ఉందని అన్నారు. చంద్రబాబును కలిసి బడేపురం గ్రామస్థులలో రెడ్డి వెంకట్రావు, మద్దినేని శివయ్య, రజనీకుమారి, అరుణ, చుక్కపల్లి రజని, సుశీల,మాధవి, లలిత తదితరులు ఉన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి తలాఇంత విరాళాలు పోగుజేసి అమరావతి పరిరక్షణ జెఏసికి అందజేస్తున్నట్లు వాళ్లు తెలిపారు.