రాజధాని పై, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రేపు జరగనుంది. మూడు రాజధానులు, అమరావతి నుంచి పరిపాలన, రాజధాని తరలింపు దిశగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. తరలింపుకు నిరసనగా రైతులు 32 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. స్థానికుల ఆందోళన సమయంలో జగన్ మోహన్ రెడ్డి సచివాలయానికి వచ్చే సమయంలో పెద్దఎత్తున బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో వలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటే, మందడం మీదుగా రావాలి. అయితే, అక్కడ ఆందోళనలు అధికంగా ఉండటంతో, ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని, హుటాహుటిన కొత్త రోడ్డును అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా జైలు భరో-ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో జేఏసీ నేతలతోపాటు రైతులకు వ్యక్తిగతంగా పోలీసులు ముందస్తు నోటీసులివ్వడం ప్రారంభించారు. అసెంబ్లీ వరిసర ప్రాంతాల్లో సమావేశాల సమయంలో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఇప్పటికే సచివాలయానికి వెళ్లే దారిలో మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరసనలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. దీంతో అసెంబ్లీకి హాజరయ్యే స్పీకర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు ప్రత్యామ్నాచ చర్యలపై ఫోకస్ చేశారు. అందులో భాగంగా అసెంబ్లీ చేరుకోవడానికి మరోదారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మత్తులు చేస్తున్నారు. కృష్ణాయ పాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆరోడ్డును పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా వాటిని పూడ్చి వాహనాల రాకపో కలకు వీలుగా మరమ్మత్తులు చేస్తున్నారు. రాజ ధాని తరలింపు ప్రకటన తర్వాత ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో ముందస్తుగా ఈ మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అవసరమైన సమయంలో ముఖ్యుల రాకపోకలు ఈ దారిగుండానే కొనసాగించనున్నారు. అసెంబ్లీ రాజధాని అంశంపై సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశముండటంతో ఉద్రిక్తతలు ఏర్పడే ఛాన్స్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసుబలగాలను మోహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతులకు ముందస్తు నోటీసులిచ్చిన పోలీసులు ఈ నెల 20న ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టంచేస్తున్నారు. ఛలో అసెంబ్లీతో పాటు జైలు భరో కార్యక్రమానికి పిలువునివ్వడంతో జెఎసిలోని నేతలకు, రైతు లకు ఈ నోటీసులు అందజేస్తున్నారు. సమావేశాలు జరిగే రోజున ఎటువంటి ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 29 గ్రామాల్లో రైతులతోపాటు పలు రాజకీయ నేతలకు పోలీసులు నోటీలు ఇచ్చారు.