ఎంపీగా ఉండి ఏం పనిచేశారని ప్రశ్నించిన ఓ ఓటరు వెనుక పరుగు తీశారు నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్. నియోజకవర్గంలో రూ. 1.20 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని, పెద్ద పెట్టున కేకలు వేశారు. వారు వినకుండా వెళ్లిపోతున్నప్పటికీ వెంటపడి మరీ కేకలు వేశారు. రోడ్డపై కాసేపు హల్చల్ చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మార్నింగ్ వాక్కు వచ్చిన వరప్రసాద్ రోడ్డుమీద వెళ్తున్న వారిని తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మీకు ఎందుకు ఓటు వేయాలని పాదచారి ఆయన్ను ప్రశ్నించారు. గూడూరు అభివృద్ధి చేసిన వారికే ఓట్లు వేస్తామని పాదచారి చెప్పడంతో వరప్రసాద్ ఖంగుతిన్నారు.
పాదచారి ప్రశ్నకు బదులుగా.. తాను రూ. 1.20 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. ఇలాంటి ఎంపీని మీరు ఎక్కడైనా చూశారా అని ఓటరును వరప్రసాద్ ప్రశ్నించారు. రూ. 40 లక్షలతో గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. తన సమాధానం వినడానికి ధైర్యం లేదని శివాలెత్తిపోయారు. వరప్రసాద్ మండిపడడంతో పాదచారి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా... వరప్రసాద్ అతడి వెంటబడి మరీ వెళ్లి సమాధామిచ్చారు. అయితే వర ప్రసాద్ చేసిన హంగామాతో అక్కడ ఉన్న వారందరూ అవాక్కయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో, ఆయన ఎందుకు ఇలా విపరీత ప్రవర్తనతో ప్రవర్తించారో అని చూసిన వారు అనుకుంటున్నారు.