వైసీపీ కోడికత్తి పార్టీ కాదని.. తెలుగుదేశం పార్టీయే సుత్తి పార్టీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రం ఇచ్చిన కోట్లాది నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడంలేదు. అన్నింటా అవినీతిలో కూరుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి? వీటికి సీఎం బదులివ్వాలి’ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని, టీడీపీ అధికారం పోయాక చంద్రబాబు నాయుడిని కోర్టుల ముందు నిలబెడతామని చెప్పారు. ఈసీ సూచనల మేరకే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు తప్పితే దాంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని నరసింహారావు పేర్కొన్నారు.
తెదేపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. . పోలీసులు కేంద్ర పరిధిలో పనిచేయరని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ఈసీకి అధికారాలు ఉంటాయని గుర్తుచేశారు. ప్రతి విషయానికీ చంద్రబాబు ప్రధాని మోదీని విమర్శించడం మానుకోవాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టిన గతే తెలుగుదేశం పార్టీకి పడుతుందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో దోపిడీ, అక్రమాల పాలన సాగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కాబోతుందన్నారు. అక్రమ రాజకీయాలకు ఈ ఎన్నికల్లో తరువాత తెరపడనున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి స్కీంలోనూ స్కామ్ జరిగిందన్నారు.
రాక్షస, దుర్మార్గపు రాజకీయాలకు మంత్రి యనమల రామకృష్ణుడు నాయకత్వం వహిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎక్కడ కనబడటం లేదన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, న్యాయమైన పాలన అందిస్తుందన్నారు. మంత్రి ప్రాంతం మంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉంటుందనుకున్నాను, కానీ ఇక్కడ 30 ఏళ్లుగా తుని ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. అందుకే ప్రజల్లో మంత్రి యనమలపై వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కూడా బీజేపీని ఆదరించినట్లయితే ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు.