ఎన్నికల సమయంలో తెదేపాను నిర్వీర్యం చేసి, అభ్యర్థుల మనోధైర్యాన్ని కోల్పోయేలా కేంద్రం, వైకాపా ప్రవర్తిస్తున్నాయని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఐటీ దాడులకు నిరసనగా శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా మోదీ ప్రవర్తిస్తున్నారంటూ అంబేడ్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని మోదీని అడిగితే అందుకు వ్యతిరేకంగా ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇటీవల జగన్ మోదీని పొగుడుతూ మాట్లాడడం, అంతకుముందు పీయూష్ గోయల్ జగన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వంటివి ఈ కుట్రలకు నిదర్శనాలని వివరించారు.
గత రెండు రోజులుగా జగన్ లోటస్‌పాండ్‌లో కూర్చొని ఈ కుతంత్రాలకు పెద్ద ఎత్తున పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక, దిల్లీల్లోనూ కేంద్రం ఈ తరహా దాడులే చేయిస్తోందని వివరించారు. మోదీ బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి చేస్తున్న ఈ తరహా చర్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటారని, వీటిని చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. చట్టప్రకారం రాజ్యాంగబద్ధ సంస్థలను తమ పని చేసుకోనివ్వాలని, ఏకపక్షంగా వాటిపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తే మోదీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
దేశాన్ని నాశనం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మొదట దేశం.. రెండో ప్రాధాన్యం పార్టీ.. మూడోది వ్యక్తిగతం అని నిన్న ఎల్‌కే అడ్వాణీ చెప్పారు. కానీ మోదీ దీనికి చాలా వ్యతిరేకం. ఆయనకు తొలుత వ్యక్తిగతం. తర్వాతే పార్టీ, దాని తర్వాతి ప్రాధాన్యం దేశంగా ఆయన భావిస్తారు’’ అని చంద్రబాబు విమర్శించారు. భాజపా, తెరాస, వైకాపాను గంగలో కలిపే పరిస్థితి రావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.