ఎన్నికల గడువుముంచుకొస్తున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాలు ఇలా బహుముఖాలుగా సాగుతున్నాయి. ఒక్కొక్క జిల్లాలో పరిస్థితిని బట్టి ఒక్కో రకం వ్యూహంతో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. ఉదాహరణకు.. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో వైసీపీ ఎన్నికల గుర్తున్న అందమైన కార్డులు, దాని పై సీరియల్ నెంబర్ల వారీగా ముద్రించారు. వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ప్రచార ఘట్టం ముగిసిన వెంటనే ఈనెల 10వ తేదీ రాత్రి, 11 ఉదయం వాటిని చూపించిన వారికి, అవి స్కాన్ చేసి, ఓటుకు నోటు అందిస్తామని చెబుతున్నారు. ఆ ఒక్కచోటే కాక, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే.. టీడీపీ అభ్యర్థులు ఏ రోజు ఎక్కడ పర్యటిస్తారో ముందే తెలుసుకుని, అదే రోజు ఆ ప్రాంతానికి చెందిన కొందరిని ముందే తమవద్దకు పిలిపించుకుంటున్నారు. వారికి గ్రామంలోని ఓటర్ల సంఖ్యను బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల దాకా డబ్బు ఇచ్చి పంపుతున్నారు. టీడీపీ అభ్యర్థి వచ్చే రోజున గ్రామస్థులందరినీ ఊరికి దూరంగా తీసుకెళ్లి మద్యం, మాంసాహారం పెట్టడమే వారు చేయాల్సిన పని. తద్వారా.. టీడీపీ అభ్యర్థి ప్రచారంలో జనం తక్కువగా కనిపించారనే ప్రచారం చేస్తూ మైండ్‌గేమ్ ఆడుతున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీకి పనిచేస్తామని, ఓట్లు వేస్తామని ఒట్టేసి చెప్పాలంటూ ఆ పార్టీ నాయకులు పలు వర్గాలపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ముఖ్యంగా మతపరంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ చర్చి పాస్టర్లను కలిసి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వైసీపీని గెలిపించుకోకపోతే ప్రభువు క్షమించడని భయపెడుతున్నారు. కుటుంబంతో పాటు ఊరిలో క్రైస్తవులందరితోనూ ఓటు వేయించే బాధ్యత తీసుకుంటామని బైబిల్‌పై ప్రమాణం చేయిస్తున్నారు. రాజకీయ సమావేశాలకు మత ప్రార్థనల ముసుగు వేసి తంతు నడిపిస్తున్నారు. చర్చిలు, మసీదులకు స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు పంచుతున్నారు. చర్చిల్లో ప్రార్థనల అనంతరం విందు ఏర్పాటు చేస్తున్నారు.
విందు తరువాత పాస్టర్లు వైసీపీ నాయకుల సమక్షంలో ఆ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే.. డ్వాక్రా మహిళలను కలిసి జగన్ వస్తే మంచి జరుగుతుందని, ఒక అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. వారితో కూడా ‘మా మీద ఒట్టు వేసి చెప్పండి’ అంటూ, బలవంతంగా చేతిని తీసుకొని తమ నెత్తిపై పెట్టుకొని ప్రమాణం చేయిస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో కీలక లీడర్లని గుర్తించి వారి ద్వారా ఆయా గ్రూపుల్లో ఉన్న సభ్యులకు బహుమతులు, నగదు ఇవ్వడానికి బేరసారాలకు దిగుతున్నారు. అయితే చాలాచోట్ల డ్వాక్రా సంఘాల మహిళలు వైసీపీ ఆఫర్లను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. అలాగే.. ఓటర్ల సమూహాలతో సంబంధాలున్న ఉపాధి కూలీ ఫీల్డ్ ఆఫీసర్లు, మేస్త్రీలపైనా దృష్టి సారిస్తున్నారు. వారికి వారి స్థాయిని బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్తున్నారు. ఓటర్లకు ఇచ్చే డబ్బులు వేరే. ఆ సొమ్మును పార్టీ కార్యకర్తలే పంచుతారు. వీరు చేయాల్సిందల్లా.. కేవలం మధ్యవర్తులుగా ఉండి, వారి చేత ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేసేలా మాట తీసుకోవడం అంతే.