నవ్యాంధ్ర పురోగతిని, జనం సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ తీరు తేటతెల్లమైంది. ఓవైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీతో కలిసి.. వైసీపీ నేతలు ఏపీని అష్టదిగ్బంధనం చేశారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అభివృద్ధే ప్రధాన అంశంగా టీడీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ వైసీపీ మాత్రం రహస్య వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రధానంగా ఎనిమిది దిక్కుల నుంచి ఎనిమిది కోణాల్లో రాష్ట్రంపైనా, అధికారపార్టీపైనా దాడులు చేస్తోంది. టీడీపీని నైతికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో తొలిసారి జరుగుతున్న ఎన్నికల సమయంలో తీవ్ర కలకలం రేగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీపై ముప్పేట దాడి కొనసాగుతోంది. నవ్యాంధ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యమంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అయితే.. ప్రతిపక్ష వైసీపీ మాత్రం.. పొరుగు రాష్ట్ర అధికార పార్టీ, కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతూ రహస్య వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ.. ఎలా వీలైతే అలా.. ఏదో ఒక రూపంలో టీడీపీయే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ముందుగా రూపొందించుకున్న వ్యూహాల ప్రకారమే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకుంటున్నాయన్నది పరిస్థితులను గమనిస్తే స్పష్టమవుతోంది.
ఆంధ్రులను కించపరుస్తూ మాట్లాడే టీఆర్‌ఎస్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేసిన బీజేపీతో కలిసి.. ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కుట్రలకు తెరతీశాడని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను చూసి ప్రతి ఒక్కరూ అంచనాకు వస్తున్నారు. ఒక అధికార పార్టీమీద ఈస్థాయిలో టార్గెట్ చేసి మరీ పాల్పడుతున్న కుట్రల విషయం ఇప్పటికే అర్థమైపోయింది. జనంలోకి ఈ విషయాలు వెళ్లిపోయాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అధికార తెలుగుదేశం పార్టీని అష్ట దిగ్బంధనం చేస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇవి ప్రధానంగా జగన్ ఆశలు పెట్టుకున్నవి.. ఐటీ దాడులు, కేంద్రం కుట్రలు, పొరుగురాష్ట్రం నుంచి ఎటాక్, ప్రచారంలో ఘర్షణలు, పచ్చ కండువాలతో దాడులు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం, కేసులతో భయపెట్టడం, కొత్తదారులు వెతకడం.