రాష్ట్ర నిఘా విభాగం డీజీ ఏ.బి.వెంకటేశ్వరరావును బదిలీ చేయాలంటూ తామిచ్చిన ఆదేశాలను వెంటనే ఎందుకు అమలుపర్చలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. దీనిపై వివరణ కోసం సీఎస్ పునేఠాను ఢిల్లీకి పిలిపించింది. ముగ్గురు అధికారులను బదిలీ చేయాలని తాము ఆదేశాలిస్తే ఇద్దరిని మాత్రమే ఎందుకు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై సీఎస్ వివరణ ఇస్తూ ‘‘నిఘా విభాగం డీజీ ఎ.బి. వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను మార్చాలని ఆదేశాలిచ్చారు. అందులో కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేశాం. అయితే నిఘా విభాగం చీఫ్ ఈసీ పరిధిలో ఉన్నారో, లేదోనని అనుమానం వచ్చింది. ఏపీ హైకోర్టు ఆ సందేహం తీర్చగానే తక్షణం ఆయన్ను కూడా బదిలీ చేశాం’’ అని పేర్కొన్నారు. ఈసీ ఆదేశాలను అమలు చేశామని సీఎస్ చెప్పినట్లు తెలిసింది.
అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం, ఈ చర్య పై మండి పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం.. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, శ్రీకాకుళం ఎస్పీ, కడప ఎస్పీలపై ‘ఫిర్యాదులు’ కాదు.. ఒకే ఒక్క ఫిర్యాదు అందింది! అదీ.. ప్రతిపక్షానికి చెందిన నేత ఫిర్యాదు. ఆ ఒక్క ఫిర్యాదు ఆధారంగానే.. అది అందిన 24 గంటల్లోపే.. వారిని బదిలీ చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది!! ..బీజేపీ పాలిత ఝార్ఖండ్‌కొకనీతి, బీజేపీని ఢీకొన్న ప్రభుత్వం ఉన్న ఏపీకి ఇంకో నీతి. ‘ఇదేనా ఈసీ రీతి’ అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!! ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారులు తప్పు చేసినట్లు తేలినా పట్టించుకోరు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా దొరబాబుల్లా తిరుగుతారు. ఇక్కడ మాత్రం వెంటనే చర్యలా?’ అని మండిపడుతున్నారు.
వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ నెల 25న ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌తోపాటు పలువురు ఐపీఎస్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఎన్నికల పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఇంటెలిజెన్స్ చీఫ్ లేరు. అయినా.. 25న ఫిర్యాదు వస్తే 26 అర్ధరాత్రి ఇంటెలిజెన్స్ చీఫ్‌తోపాటు ఇద్దరు ఎస్పీలను బదిలీ చేయాలంటూ ఈసీ ఆదేశించింది. అసలు తనకొచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎక్కడ జరిపింది. అందులో తప్పు చేసినట్లు తేలిందా? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులపై చర్యలకు దిగింది. దీంతో, ఈసీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఝార్ఖండ్‌లో ఆరోపణలు నిజమని రుజువై దాదాపు 21 నెలలవుతున్నా ఈసీ ఆదేశాలు అమలుకాలేదక్కడ. కానీ, ఏపీలో మాత్రం ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రభుత్వం కొత్తగా నియమించిన కలెక్టర్‌ను విధుల్లో చేరనీయకుండానే బదిలీ చేయాల్సిందిగా ఆదేశించడం మొదట్లోనే చర్చనీయాంశమైంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక, రాజకీయ పార్టీ ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని విచారణ చేయకుండానే అధికారుల బదిలీలకు అర్ధరాత్రి ఆదేశాలివ్వడంతో ‘ఈసీ కూడానా?’ అన్న చర్చ మొదలైంది.