నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటర్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. జగన్ ఒక్క కనుసైగ చేస్తే చాలు ఒక్కరు కూడా మిగలరు.. చంపడమా? చావడమా? అంటూ అనిల్‌కుమార్ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఈసీ ఆదేశించిందని తెలిపారు. ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించేందుకు ‘చావో రేవో’ అన్నట్లుగా ప్రయత్నించడం మామూలే. కానీ... వైసీపీ నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అంతకుమించిన మార్గం ఎంచుకున్నారు.
‘‘మనముం దు ఉన్నది ఒక్కటే! జగనన్న కోసం చంపడమా.. చావడమా! 2019లో రాష్ట్రంలో ఒక్క వైసీపీ జెండా మాత్రమే ఎగరాలి. ఒక్క కనుసైగ జగన్మోహన రెడ్డి చేసిననాడు ఎవ్వరూ మిగల రు’’ అని హెచ్చరించారు. కొన్ని నెలల క్రితం చేసిన ఈ ప్రసం గం ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తెలిపారు. ‘ఎన్నికల యుద్ధంలోకి వెళ్తున్నందున సైనికుల్లాగా.. చంపడమో, చావడమో తప్ప వెనుతిరగవద్దు’ అని అన్నానని, వీడియోను కట్ చేసి ప్రచారంలో పెట్టారని మంగళవారం వివరణ ఇచ్చారు.
ఎన్నికల ముందు ‘ఓటు మల్లయ్య’.. ఎన్నికలయ్యాక ‘బోడి మల్లయ్య’! రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై ఉన్న వ్యంగ్యాస్త్రమిది! కానీ, చాలాచోట్ల వైసీపీ నేతలు పోలింగ్ ముగిసేదాకా కూడా ఆగలేకపోతున్నారు. నోరు పారేసుకుంటున్నారు. చేయి చేసుకుంటున్నారు. ‘వైసీపీకి ఓటు వెయ్యం’ అని చెబితే అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయించడం, ప్రచారానికి రాకపోతే ఏకంగా దాడులు చేయడం, బూతులు తిట్టడం... ఇలా ఒకటా రెండా! ఇక... శాసన సభలో, బయటా ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతలు రకరకాలుగా దూషించారు. ఇప్పటికీ దూషిస్తున్నారు. అధికారులు, పోలీసులపైనా ప్రతాపం చూపిస్తున్నారు. ఆయా దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వామ్మో వైసీపీ నేతలు... ఇప్పుడే ఇలా ఉంటే, మరి అధికారంలోకి వస్తే!’ అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు!