ఎన్నికల సమయంలో విజయవాడలో భారీ హవాలా రాకెట్ బయటపడింది. రూ.1.70 కోట్ల హవాల సొమ్ము తేలడం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభినవ్‌రెడ్డి 12 కంపెనీలు స్థాపించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాజాగా మిర్చిని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. విజయవాడలోని వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి విశాఖకు చెందిన నాగరాజును నియమించుకున్నాడు. అతడు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న మనోరమ హోటల్‌లో ఒక్కడే ఉంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. విశాఖకు చెందిన నానితో కలిసి అభినవ్ చెప్పిన వారి వద్దకు వెళ్లి రోజుకు రూ.10-25 లక్షల వరకూ వసూలు చేసి ఆ మొత్తాన్ని రూమ్‌లోనే ఉంచేవారు.

nani 03042019

ఒకరోజు నాగరాజుకు అభినవ్ ఫోన్ చేసి ఎన్నికల సమయం కావడంతో పోలీసులు ఎక్కడైనా ఆపి తనిఖీ చేసి డబ్బులు పట్టుకుంటే వారితో వాదనకు దిగొద్దని చెప్పాడు. ఈ మాటలు విన్న నాని డబ్బులు కొట్టేసేందుకు పథకం వేశాడు. తన స్నేహితుడు రవీంద్రకు విషయం చెప్పాడు. ఇద్దరూ గత నెల 18, 19 తేదీల్లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 25న నాగరాజు, నాని కలిసి వ్యాపారుల నుంచి రూ.45 లక్షలు వసూలు చేశారు. అదే రోజు రవీంద్ర మైలవరానికి చెందిన హర్షవర్దన్, భవానీ శంకర్, 17 ఏళ్ల బాలుడు విజయవాడకు వచ్చారు. నాని నాగరాజు బైక్‌పై విజయవాడకు చేరుకోగానే మిగిలిన ముగ్గురూ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వేషం వేసుకుని వారిని ఆపారు. బ్యాగును తనిఖీ చేయగా.. రూ.45 లక్షలు బయటపడటంతో లెక్కలు అడిగారు. కొద్ది సేపటికి రవీంద్ర ఇన్‌స్పెక్టర్ వేషంలో వచ్చాడు. అతడు రాగానే హర్షవర్దన్, భవానీ శంకర్‌తో పాటు బాలుడు నాగరాజుపై దాడి చేశారు. మొత్తం డబ్బు చూపించమనడంతో మనోరమ హోటల్‌కు తీసుకొచ్చారు. రూంలోని రూ.1.70 కోట్లు ఎత్తుకుపోయారు. దీంతో నాగరాజు, నాని, దాసు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.45 లక్షలనూ పంచుకోవాలని డిసైడ్ అయ్యారు.

nani 03042019

టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొత్తం డబ్బు తీసుకుపోయారు కనుక ఇది కూడా ఆ లెక్కలోకే వెళుతుందని ప్లాన్ వేశారు. తలా రూ.15 లక్షలు తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ విషయాన్ని నాగరాజు.. అభినవ్‌రెడ్డికి చెప్పాడు. ఆయన దీనిపై కొత్తపేట పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. మొత్తం డబ్బుతో రవీంద్ర మైలవరంలోని తన ఇంటికి చేరుకుని డబ్బు ఎవరికీ కనిపించకుండా పెరట్లో దాచాడు. తరువాత విశాఖలోని నాని ఇంటికి చేరుకున్నాడు. ఎన్నికల డబ్బు అని అతని కుటుంబ సభ్యులకు రూ.22 లక్షలు ఇచ్చాడు. పోలీసులు ముందుగా నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. మిగతా వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి మిగతా కోటి 26 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అభినవ్ రెడ్డి ఎవరు? ఏంటనే విషయం సస్పెన్స్‌గా మారింది. ముంబైలోని కొందరు బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో డబ్బు బదిలీ చేస్తుంటాడు. డబ్బు బదిలీ కాగానే ఒక కోడ్ అభినవ్ రెడ్డికి చేరుతుంది. ఆ కోడ్ అభినవ్‌కి చేరగానే.. విజయవాడలోని నాగరాజుకు చెప్పి ఆయా వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బు తీసుకోమనే వాడు. ఇదంతా హవాలా అని పోలీసులు నిర్థారించి, ఈడీ, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ డబ్బు పంపిణీకి హవాలాలో చేరిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read