కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైన ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎండల్లో ప్రచారం చేయడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేకి ఏంజరిగిందో అర్థంకాక అనుచరులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను తాడిగడపలోని ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. ఎమ్మెల్యే వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో బోడె ప్రసాద్ శ్వాస సంబంధ ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.
అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో బోడె మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు మరోసారి టికెట్ రావడంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించానని చెప్పారు. గత ఎన్నికల కంటే ఈసారి విశేష స్పందన కనిపిస్తోందని... ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలే టీడీపీకి విజయాన్ని కట్టబెడతాయని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 42 గ్రామాల్లో 90 శాతం అభివృద్ధి చేశానని తెలిపారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతానని, చిన్నచిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగుతానని చెప్పారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. 1,85, 560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా, 94, 991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. 41,356 వీవీపాట్ యంత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల కోసం ఏకంగా 270 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు. దాదాపు 2.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకునే అవకాశం ఇక లేదు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11న తొలి విడతలో ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుండగా.. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి.