ఎన్నికల వేళ ఏపీలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. తిరుపతి గ్రామీణ మండలం పద్మావతిపురంలో నివాసం ఉంటున్న వైకాపా నేత గణపతినాయడు ఇంటిపై సోమవారం వేకువజామున పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన గోడ గడియారాలు, చీరలు పోలీసులకు పట్టుబడ్డాయి. ముందుగా అందిన రహస్య సమాచారం మేరకు తిరుచానూరు సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వైకాపా నేత ఇంటిపై దాడులు నిర్వహించారు. ఓ గదిలో భారీగా భద్రపరచిన గోడగడియారాలు, చీరలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తూ.. పంచడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. అలాగే మరో వైసీపీ నేత గణపతినాయుడు ఆధ్వర్యంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న వాచీలు, చీరలను సీజ్ చేసినట్లు చెప్పారు. మరో పక్క, కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు వైసీపీ క్యాలెండర్లు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వైసీపీ కార్యకర్త పవన్ ఇంట్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన వస్తువులను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.