‘మీ భవిష్యత్తును నా బాధ్యతగా తీసుకుంటాను. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి కోసం పది సూత్రాలను అమలు చేస్తాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదలకు పింఛను రూ.3 వేలకు పెంపు, ఐదేళ్లలో మూడుసార్లు పసుపు- కుంకుమ, రైతుల కోసం అన్నదాత సుఖీభవ, బీసీలకు రూ.10వేల కోట్లతో ప్రత్యేకంగా బ్యాంకు... ఇలా మొత్తం పది అంశాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికీ కనీసం రెండు లక్షల వార్షికాదాయం లభించేలా చూస్తామని తెలిపారు. పేదల ఇళ్లలో అమ్మాయి పెళ్లికి రూ.లక్ష సహాయంగా అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి రావులపాలెం, కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో నినదించాం. రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. పది లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువతకు తగు న్యాయం చేస్తాం. జాబు రావాలి! అందుకు... మళ్లీ మళ్లీ బాబు రావాలి’ అని చంద్రబాబు నినదించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు నిరంతర కృషి చేస్తామన్నారు. 40ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లల్లో చేసి చూపించిన ఘనత టీడీపీదేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని... వాటిని కూడా ఉచితంగానే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల గృహ ప్రవేశాలు జరిగాయని... కొత్త చరిత్ర సృష్టించామని చెప్పారు.

గోదావరి నీరు తాగినవారంతా... రాష్ట్ర విభజనతో కృష్ణా జిల్లాకు నీరు లేకుండా పోయిందని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యను తీర్చామన్నారు. ‘గోదావరి నీరు తాగినవారంతా టీడీపీకే ఓటేయాలి’ అని కోరారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి కాకుండా జగన్‌ అడ్డుపడ్డారని చెప్పారు. పోలవరం పనులను పూర్తి చేసి జూలైలో గ్రావిటీ ద్వారా, డిసెంబర్‌లో పూర్తిస్థాయిలో నీటిని డెల్టాకు తీసుకు వస్తామన్నారు. గోదావరి, పెన్నాలను అనుసంధానిస్తామన్నారు. ధైర్యాన్ని నింపుతోంది... ‘‘తిరుపతిలో నరసమ్మ అనే వృద్ధురాలు టీడీపీ సభకు హాజరై డాన్స్‌ చేసింది. ఎందుకమ్మా ఈ ఉత్సాహం అని అడిగితే... తనకు నలుగురు కొడుకులున్నా పెద్దకొడుకువై ఆదరించావని సభా ముఖంగా చెప్పింది. ఈ ఉత్సాహం నాలో ధైర్యం నింపుతోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రైతులకు రూ.1.50 లక్షల మేర రుణమాఫీ చేశామన్నారు. పదిశాతం వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు.

దిశ మార్చే దశ సూత్రాలు: 1. డ్వాక్రా చెల్లెమ్మలకు ఐదేళ్లలో మూడుసార్లు పసుపు కుంకుమ కానుక. 2. పేద యువతుల పెళ్లికి లక్ష రూపాయలు కానుక. 3. వెనుకబడిన వర్గాల (బీసీలు) కోసం రూ. 10వేల కోట్లతో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు. 4. పట్టణ ప్రాంతాల్లో మరో 20 లక్షల గృహాలు... ఉచితంగానే కేటాయింపు. 5. ఇప్పుడు ఇస్తున్న పింఛను 2 వేల నుంచి 3 వేలకు పెంపు. అర్హులైన వారందరికీ చెల్లింపు. 6. రైతులకు పూర్తిస్థాయిలో సహకారం... ‘అన్నదాత - సుఖీభవ’ ప్రతి ఏటా అమలు. 7. యువతకు నిరుద్యోగ భృతి అందిస్తూనే... నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం! 8. ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా మంచి నీటి సరఫరా. 9. నదుల అనుసంధానంతో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం. 10. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల కనీస ఆదాయం.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read