భారీ బహిరంగ సభతో సత్తా చాటేందుకు అధికార తెలుగుదేశం ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఇందిరా ప్రియదర్శిని నగరపాలక మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు అంతా సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమబంగ, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతున్నారు. దాదాపు మూడుగంటలపాటు సభ ఉంటుంది. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతను అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తలకెత్తుకున్నారు. ఇప్పటికే వీరితో మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చించారు. శరవేగంగా పనులు: సమయం తక్కువగా ఉండడంతో ఆయా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయానికి వేదిక నిర్మాణ పనులు పూర్తికానుంది. సభకు హాజరయ్యే ప్రజలు కూర్చొనేందుకు కుర్చీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు.
ఆయా పనులను పార్టీ నేతలకు అప్పగించారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలనకు తెదేపా సీనియర్ నేత కంభపాటి రామ్మోహనరావు విశాఖకు చేరుకున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను సభాస్థలికి తరలించే విధంగా చర్యలు చేపట్టారు. వార్డుల వారీగా వాహనాలను తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తరలింపు మొదలు కానుంది. కనీసం 60 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ వార్డు అధ్యక్షులతో తెదేపా నగర అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎ రెహ్మాన్, పార్టీ రాష్ట్ర నేత కంభంపాటి రామ్మోహనరావులు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఇందిరాప్రియదర్శిని మైదానం తెదేపా నేతలకు బాగా కలిసొచ్చిన వేదికగా పేరొందింది. తొలుత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి రోడ్ షో నిర్వహించాలని పార్టీ నేతలు భావించారు. సభ అయితే బాగుంటుందని రోడ్డుషోను విరమించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బహిరంగ సభ నిర్వహించారు. చంద్రబాబుతో పాటు నాటి మిత్రపక్ష నేతలు నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌లు హాజరయ్యారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలతో పొత్తు లేదు. ఆ సభ పార్టీకి కొత్త ఊపు తెచ్చిందన్న సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా సభను నిర్వహిస్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ మాతోనే ఉన్నారని, ఆమె ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఉంటారని చెప్పిన ఒక్క రోజుకే, ఆమె చంద్రబాబుతో కలిసి విశాఖ మీటింగ్ లో పాల్గుంటారు అనే వార్తా రావటంతో, ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటో...