ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దెందులూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సందర్భంగా.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ను ఓ కానిస్టేబుల్ తోసేశారు. వైసీపీ నాయకులు ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో దెందులూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఫెసిలిటేషన్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను వైసీపీ నాయకులు ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు.
దీంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి చింతమనేని రంగంలోకి దిగారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఒక కానిస్టేబుల్ చింతమనేనిని తోసివేయడంతో ఆయన కింద పడబోయారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు చేసారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి, వారిని అక్కడ నుంచి పంపేసారు. ఈ పరిణామాలతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి వచ్చిన ఉద్యోగులు ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.