సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న టీడీపీ నేత గల్లా జయదేవ్ అకౌంటెండ్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దీంతో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా ఐటీ శాఖ చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్షసాధింపు చర్యగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడి ఐటీ దాడులు జరుగుతుంటే వేధిస్తున్నారని చెప్పడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడటం కేవలం విపక్షాలకే చెల్లిందని దుయ్యబట్టారు.
ఇది ఇలా ఉంటే, ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ద్వివేదీ వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ కొమ్ము కాయట్లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పనిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోంది తప్ప ఏ ఒక్క పార్టీకో సహకరించాలని ఆదేశించడంలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని ద్వివేది పునరుద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) ఉద్దేశం కాదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా స్పష్టం చేశారు. సోదాలపై మీడియా, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే రెవెన్యూ విభాగం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఈసీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల వేళ అక్రమ నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఈసీకి కచ్చితంగా చేరవేయాల్సిన అవసరం ఉందని సునీల్ అరోడా గుర్తుచేశారు. అలాగే సీబీడీటీ ఛైర్మన్, రెవెన్యూ విభాగం కార్యదర్శికి నిన్న జరిగిన సమావేశంలో సమన్లు జారీ చేశారని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. వారు ఉన్నతాధికారులనీ.. వారికి సమన్లు జారీ చేసే అధికారం తమకు లేదని తెలిపారు.