కేంద్రం పెడుతున్న ఇబ్బందులు, విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఈసీ ఆడటం, తెలుగుదేశం నేతలను కారాడుతున్న ఐటి అధికారులు, ఐటి దాడులు, ఇలా అన్ని రకాలుగా ఎన్నికాల ఒక్క రోజు ముందు కూడా, ఇబ్బంది పెడుతున్న వైఖరికి నిరసనగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. చంద్రబాబు కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయానికి వెళ్లనున్నారు. సీఈవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎం చంద్రబాబు నిన్న రాత్రి లేఖ రాసారు. అయితే ఆ లేఖను నేడు సీఈవోకు కూడా అందజేయనున్నారు. సీఈవో నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈసీ కార్యాలయం దగ్గరే ధర్నా చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరో పక్క, నిన్న రాత్రి కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈసీ తీరు దుర్మార్గంగా ఉందని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని మండిపడ్డారు. పోలీసు పరిశీలకులుగా ఉన్న కె.కె.శర్మను బదిలీచేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారని, ఇది దారుణమని అన్నారు. టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోందని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. పోలీసు అధికారుల బదిలీ విషయంలో ఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈసీ తీరును 66 మంది రిటైర్డ్ అఖిల భారత సర్వీసు అధికారులు తప్పుపట్టారని, అంత మంది అధికారులు రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు.