ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించడం గురించి వైసీపీ తన మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానంపై జగన్ మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్ కు ఏమాత్రం అవగాహన లేదని దుయ్యబట్టారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లాలంటే అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు.
ఇన్ని నేరాలు, కేసులున్న వ్యక్తులను నమ్మి ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నించారు. ‘నేరాలు-ఘోరాలు పార్టీ’కి ఓటేస్తే జీవితాంతం క్షోభ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగానికి వెళితే వ్యక్తిత్వం, చదువులకు సర్టిఫికెట్ అడుగుతారనీ, మరి రాజకీయాల్లో ఉండేందుకు క్యారెక్టర్ సర్టిఫికెట్ జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. రూ.63,000 కోట్ల రఫేల్ కుంభకోణానికి పాల్పడిన బీజేపీకి ఎవరైనా ఓటేస్తారా? అని అడిగారు. వైసీపీ 97 మంది నేరగాళ్లను ఈ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిందనీ, అలాంటి పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ఈసారి టీడీపీ ఘనవిజయం సాధించడం సాధ్యమని జోస్యం చెప్పారు.