తెలుగుదేశం ప్రయత్నాలు ఫలించాయి. తిరుగుబాటు అభ్యర్ధులు ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. 12 నియోజకవర్గాలలో టీడీపీ రెబల్ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో ఆయా జిల్లాల అగ్రనేతలు చేసిన ప్రయత్నాలతో రెబల్స్ రంగం నుంచి నిష్ర్కమించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు, విశాఖ సౌత్‌లో మహ్మద్ సాదిక్, గాజువాకలో లేళ్ల కోటేవ్వరరావు, మాచర్లలో చలమారెడ్డి, రాయదుర్గంలో దీపక్ రెడ్డి, రాజోలులో బత్తుల రాము, కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, నెల్లూరు రూరల్‌లో దేశాయశెట్టి హనుమంతరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోడెల సూర్యలత, పలమనేరులో సుభాష్ చంద్రబోష్,
పుట్టపర్తిలో బీసీ. గంగన్న, మల్లెల జయరామ్‌లు, తాడికొండలో బెజ్జం సాయిప్రసాద్‌లు తొలుత తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దీంతో పార్టీ అగ్ర నేతలు జోక్యం చేసుకున్నారు. ఈ తిరుగుబాటు అభ్యర్థులకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియామక పదవులు, ఎమ్మెల్సీలు ఇస్తామని పార్టీ హై కమాండ్, స్థానిక నేతల నుంచి హామీ ఇచ్చారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో వీరంతా రంగం నుంచి తప్పుకున్నారు. ఎన్నికల సమయంలో ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇది ఇలా ఉంటే, కృష్ణాజిల్లా అవనిగడ్డలో కూడా ప్రధాన పక్షాల అభ్యర్దులకు తలనొప్పి తప్పడంలేదు. అవనిగడ్డలో వైసీపీ కి రెబల్ అభ్యర్థిగా ఉన్న గుడివాక శ్రీమన్నారాయణ ప్రజాశాంతి పార్టీలో చేరి బీ- ఫారం తెచ్చుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధి రవిశంకర్ పోటీ ఎవరికి నష్టం కలిగిస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఆయా నేతలతో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని ప్రయత్నించినప్పటికీ వారు దిగిరాలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి కోరాడ విజయ్ కుమార్ పోటీ వైసిపి అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఇబ్బందికరంగా మారింది. ఆయన నామినేషన్ ఉపసంహరణ కోసం కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ విజయ్ కుమార్ బరిలో ఉంటానని తేల్చిచెప్పారు.