కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను తక్షణం బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. సీనియరు అధికారికి జిల్లా బాధ్యతలు అప్పజెప్పాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్.వివేకా నందరెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్టులు ఆపేందుకే ఈ బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. రాహుల్‌దేవ్ శర్మ బాధ్యతలు చేపట్టి సరిగ్గా 38 రోజులకే బదిలీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. కాగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించ డంతో వివేకా హత్యపై దర్యాప్తు చేస్తున్న సిట్ వివరాలను మీడియాకు వివరాలు వెల్లడించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఇలా ఎస్పీ బదిలీ కావడం సర్వత్రా చర్చ సాగుతోంది.
మూడు నెలల క్రితం అభిషేక్ మహంతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ కారణాలతో మహంతిని ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రభుత్వం బదిలీ చేసింది. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న రాహుల్‌దేవ్ శర్మను జిల్లా ఎస్పీగా నియమించడంతో ఆయన ఫిబ్రవరి 18న ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం, ఎన్నికల ఏర్పాట్లలో బిజీబిజీగా ఎక్కడా కూడా రాజీలేకుండా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌దేవ్ శర్మకు కొద్ది కాలంలోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నెల 15న మాజీ మంత్రి వైఎస్.వివేకా నందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వీరిపై ఎస్పీ నేతృత్వంలో 7 బృందాలు, ప్రభుత్వం నియమించిన సిట్ లో 5 బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. వివేకా అనుచరులే హంతకులన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. సిట్ బృందం వివేకా కుటుంబ సభ్యులతో పాటు ఇది వరకు 65 మంది అను మానితులను విచారించింది. త్వరలో ఈ కేసు ఛేదించి వివేకా హత్యకు కారణాలు పోలీసులు వెల్లడించాలని కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసు విచారణ పూర్తిగా గోప్యంగా సాగుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో నిందితులు ఎవరన్నది తేలితే ఇబ్బందులు వస్తాయని ఎస్పీని బదిలీ చేస్తే సరిపోతుందని కొందరు వ్యవహరిం చారు. నామినేషన్ వేసేందుకు పులివెందులకు వచ్చిన రోజున జగన్ మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో దహనాలు, కొందరిని అరెస్టు చేస్తారని వెల్లడించారు. మీరే ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వివేకా సతీమణి హైకోర్టును ఆశ్రయించి రాష్ట్ర పోలీసు దర్యాప్తు వద్దని, స్వతంత్ర దర్యాప్తు విచారణ చేపట్టాలని పిటీషన్ వేశారు. ఇదిలా ఉండగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హత్యను రాజకీయం చేస్తున్నారని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర హోం శాఖ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, పోలీసు బృందాలు దాదాపు ఈ కేసు మిష్టరీని ఛేదిస్తూ కొందరు ముఖ్యులను అరెస్టుచేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. వివేకా హత్య కేసు కారణంగానే ఎస్పీ బదిలీ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాగా, ఎస్పీ బదిలీ కావడంతో ఇక వివేకా హత్యకేసు వ్యవహారం ఇక అటక ఎక్కినట్లేనని, ఎన్నికలు అయిపోయేదాకా ఈ మిస్టరీ వీడే అవకాశం లేదని ప్రచారం సాగుతోంది.