ఓట్ల పండుగకు ఏపీకి వెళ్లే బస్సులు సజావుగా చేరుతాయా? సొంతూర్లకు సకాలంలో వెళ్లి ఓటు వేయాలని ఆశపడుతున్న ఆంధ్రా ఓటర్ల కల నెరవేరుతుందా అంటే అనుమానమేనని పలువురు ఏపీ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి వెళ్లే బస్సులను ఏదో ఓ సాకుతో ఆపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నెల 11న ఏపీలో ఓటు వేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి లక్షలాది మంది సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఇప్పటికే దాదాపు అన్ని బస్సుల్లో 90శాతం రిజర్వేషన్లు అయిపోయినట్లు సమాచారం. ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తమ అనుచరగణంతో జనాలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఓటు వేయాలనే ఆసక్తితోనే వారంతా ఆంధ్రాకు వెళ్తుండటంతో.. ఎన్నికల తేదీకి ఒక్క రోజు ముందు.. అంటే ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నమే వారంతా ఏపీకి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే, వారంతా సకాలంలో ఏపీకి వెళ్లి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రవాణా శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని ఏపీ వెళ్లే ప్రైవేటు బస్సులను అడ్డుకునే అవకాశం ఉందని ఆంధ్రా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్ లేదని, ఫిట్‌నెస్ లేదని, నిబంధనలు పాటించడం లేదని.. ఇలా ఏదో ఒక సాకుతో బస్సులను మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వీలైనంత ముందుగానే సొంతూర్లకు చేరుకునేందుకు ఏపీ ఓటర్లు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఒకవేళ ప్రైవేటు బస్సులను మధ్యలోనే అడ్డుకుంటే.. సకాలంలో వెళ్లి ఓటేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.