ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రైతు రుణమాఫీ పథకం కింద నాలుగో విడత నిధులను విడుదల చేసింది. 4వ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్లు విడుదల చేసింది. 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.39 వేల చొప్పున జమ కానుంది. దీనికి సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియా ఎదుట వెల్లడించారు. రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే.. వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని కుటుంబరావు తెలిపారు. మొత్తం 58.32 లక్షల మంది రైతుల్లో 23.76 లక్షల మందికి తొలి విడతలో రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఖరీఫ్ లోగా అన్నదాత సుఖీభవ క్లియర్ చేస్తామన్నారు. పసుపు-కుంకుమ 3 విడత చెక్కు సొమ్మును బ్యాంకుల్లో జమ చేసినట్లు కుటుంబరావు చెప్పారు.
దీంతో 2014 మార్చికి ముందు వ్యవసాయ రుణాల బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసినట్లు అవుతుంది. ఏపీ విభజన వల్ల రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా, గత ఎన్నికల సమయంలో టీడీపీ మ్యానిఫెస్టోలో రైతులకు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఒక్కో రైతుకు రూ.లక్షలన్నర వరకు ఉపశమనం కల్పిస్తానని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 58.29 లక్షల మంది రైతులకు రూ.24,500 కోట్లు రుణ మాఫీ చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా రైతుసాధికార సంస్థను ఏర్పాటు చేసి, 2014-15లో తొలి విడతగా రూ.50 వేల లోపు రుణాలను ఏక మొత్తంగా మాఫీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రుణమాఫీ నిబంధనలు వర్తించని ఉద్యాన రైతులకూ మేలు చేయాలని భావించిన సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2,22,679 ఉద్యాన రైతుల ఖాతాలకు రూ.384.47 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
రుణమాఫీపై రైతులకు భరోసా కల్పించేందుకు రుణ ఉపశమన పత్రాలను జారీ చేసింది. రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు రైతులు ఈ ఉపశమన పత్రాలను సంబంధిత బ్యాంకుల్లో అప్‌లోడ్ చేయించుకుని, మాఫీ సొమ్మును ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా 2016లో 2వ విడత, 2017లో 3 విడత రుణమాఫీ చేశారు. పైగా 10% వడ్డీతో కలిపి రుణమాఫీ అమలు చేశారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గత మూడేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు రుణ మాఫీ వర్తించలేదని రైతుసాధికార సంస్థకు అర్జీలు పెట్టుకోవడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అర్హత కలిగిన రైతులకు మాఫీ సొమ్ము జమ చేసింది. జిల్లాల్లో గ్రీవెన్స్‌లు నిర్వహించి మరీ అర్జీలు స్వీకరించి పరిష్కరించారు.