రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో అనూహ్య రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రయోగం వైసీపీ వర్గాలకు చెమట పట్టిస్తోంది. తొలుత ఆషామాషీగా తీసుకున్న ఆ పార్టీ నేతలు ఇపుడిపుడే చంద్రబాబు వ్యూహంలోని పదును, లోతు చూస్తున్నారు. అక్కడ ఇతర నినాదాలకు తోడు సామాజికవర్గమూ కీలకం కావడంతో ఆ దిశగా చంద్రబాబు పాచిక విసిరారు. అలా చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగప్రవేశం చేయడంతో ప్రతిపక్ష పార్టీ అంచనాలు తారుమారవుతున్నాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం రాయలసీమలో బలిజ సామాజికవర్గానికి అనధికారిక రిజర్వుడు స్థానం వంటిది. నియోజకవర్గం ఏర్పడింది మొదలు తొలి రెండు ఎన్నికలు, చివరి ఎన్నికలు తప్పితే మిగిలిన అన్ని సార్లూ బలిజ వర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలిచారు. 1962 నుంచీ 2009 వరకూ ఇదే సాంప్రదాయం కొనసాగింది.
ప్రధాన పార్టీలు ఈ వర్గానికి చెందిన వారికే టికెట్లు కేటాయించేవి. గత ఎన్నికల్లో వైసీపీ ఈ సాంప్రదా యాన్ని పాటించలేదు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. టీడీపీ కూడా అనివార్యంగా బీజేపీ పొత్తు వల్ల ఆ పార్టీ సూచించిన దగ్గుబాటి పురందేశ్వరిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె కమ్మ సామాజికవర్గానికి చెందినదనే అంశం పక్కన పెడితే టీడీపీ వర్గాలు ఆమె రాకను జీర్ణించుకోలేదు. దాంతో పలుచోట్ల సహాయ నిరాకరణ ఎదురైంది. ఫలితంగా బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పరాజయం పాలైంది. వైసీపీ అభ్యర్థి సునాయాసంగా గెలిచారు. ఆ పార్టీ తాజా ఎన్నికల్లో కూడా అతనికే టికెట్ కేటాయించింది. ఇక్కడే టీడీపీ అధినేత తనదైన శైలిలో రాజకీయం నడిపారు. రెడ్డి సామాజికవర్గం నుంచీ లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఇస్తారని అందరూ భావించగా అందరి అంచనాలనూ తారుమారు చేసిన చంద్రబాబు బలిజ వర్గానికి చెందిన సత్యప్రభను అభ్యర్థిగా నిలిపారు.
ఫలిస్తున్న చంద్రబాబు వ్యూహం.. తమ గెలుపునకు తిరుగులేదన్న ధీమాతో ఇతర సెగ్మెంట్లలో సర్దుబాట్లతో కాలక్షేపం చేస్తూండిన వైసీపీ నేతలు చంద్రబాబు వ్యూహంతో ఇపుడు చెమట చిందించాల్సివస్తోంది. రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే సంఖ్యలో వున్నారు. మిగిలిన తంబళ్ళపల్లె సెగ్మెంట్లో కూడా వారి సంఖ్య ఓ మోస్తరుగానే వుంది. ఆ వర్గంలో మెజారిటీ ఓటర్ల మద్దతు ఇదివరకూ టీడీపీకే వుండేది. తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీకి దిగడంతో ఈ వర్గం ఓట్లన్నీ జనసేనకు మళ్లుతాయని వైసీపీ నేతలు భావించారు. దానివల్ల టీడీపీ ఓట్లు చీలి తాము లబ్ధి పొందుతామని ఆశపడ్డారు.అయితే బలిజ సామాజికవర్గానికే చెందిన సత్యప్రభ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తెర మీదకు రావడంతో వారి ఆశలకు గండి పడినట్టవుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్న సీనియర్ కార్యకర్తలు, నాయకులు రాజంపేట పార్లమెంటు స్థానంలో టీడీపీకి ఇంతటి అనుకూలత గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. వీటన్నింటి నేపధ్యంలో రెడ్డి, ఎస్సీ, ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని, బలిజ వర్గం ఓట్లు చీలిపోయి తమకు అనుకూలిస్తుందని భావిస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇపుడు మారుతున్న సమీకరణలతో ఆందోళన చెందుతున్నారు. గెలుపోటములు ఎలా వున్నా చంద్రబాబు పదునైన వ్యూహం ప్రత్యర్థుల ధీమాను పటాపంచలు చేసిందనేది మాత్రం నిస్సందేహం.