ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఆదివారం జల్పాయిగుడి, ఫలకతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా సూచనల మేరకే ఎన్నికల సంఘం (ఈసీ) నడుచుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎందుకు బదిలీ చేశారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చుతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎందుకు తొలగించారు? చివరి క్షణం మార్పులపై అంత ఇష్టం ఉంటే సొంత కేబినెట్ కార్యదర్శినో, కేంద్ర హోం కార్యదర్శినో ఎందుకు తీసేయలేదు.
నేను ఎందరో ప్రధానులతో కలిసి పని చేశాను. మోదీలాంటి కక్షసాధింపు ప్రధానిని చూడలేదు’’ అని నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన అనిల్ చంద్ర పునేఠాను తొలగించి, ఎల్.వి.సుబ్రహ్మణ్యంను నియమించడాన్ని ఎన్నికల సభల్లో ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదాయపు పన్ను విభాగం, సీబీఐలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మమత విమర్శించారు. ‘‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఇళ్లను సోదా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినీ వదలలేదు’’ అని విమర్శించారు. తనను ఎంతగా భయపెట్టాలని ప్రయత్నిస్తే అంత గట్టిగా గర్జిస్తానని మమత హెచ్చరించారు.
‘‘దీదీ ఎవరికీ, దేనికీ భయపడే వ్యక్తి కాదు’’ అని అన్నారు. భాజపా సూచనల మేరకే పశ్చిమ బెంగాల్‌లోనూ నలుగురు ఐపీఎస్ అధికారులను తొలగించడంపై మండిపడ్డారు. ఇందుకు తీవ్ర నిరసన తెలుపుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏకపక్షంగా, దురుద్దేశాలతో కూడిన ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులను బదిలీ చేయడంపై తానేమీ కలవరం చెందడం లేదని అన్నారు. ఓటమి భయం ఉన్నవారే ఇలాంటి పనులకు పాల్పడతారని విమర్శించారు. ఎంతమంది అధికారులను బదిలీ చేస్తే తమ విజయావకాశాలు అంత పెరుగుతాయని చెప్పారు. వారణాసిలో గంగను పరిశుభ్రం చేయలేని వ్యక్తి ఇక్కడకి వచ్చి మాట్లాడుతున్నారని మోదీని ఉద్దేశించి విమర్శించారు. సీపీఎం హయాంలో శారదా కుంభకోణం జరిగితే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అందులో సంబంధం ఉన్న ఎంపీ ముకుల్ రాయ్‌ను మోదీ వేదికలపై పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని ఆరోపించారు. మోదీని ‘నకిలీ చౌకీదార్’ అని విమర్శించారు. ఈ చౌకీదార్ అబద్ధాలకోరే కాదు, దొంగ కూడా అని ఆరోపించారు.