‘అలీ కష్టాల్లో ఉంటే సాయపడ్డాను అని మీరంటున్నారు..ఏం సాయ చేశారు? డబ్బిచ్చారా? సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పించారా?’ అని సినీ నటుడు, వైకాపా నేత అలీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ప్రచారంలో భాగంగా కల్యాణ్ అలీపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అలీ స్పందించారు. ఆయన మాట్లాడిన వీడియోలను సోమవారం రాత్రి విడుదల చేసారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారు రాజమండ్రిలో మీరు ఒక చిన్న కామెంట్ చేశారు. సర్..! నేను పుట్టి పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేస్తే బాగుంటుందని నా తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి, కులమతాలకు అతీతంగా పేదలకు సేవ చేస్తున్నా.
"ఆ సమయంలో నా గురించి మాట్లాడాలన్న ఆలోచన మీకు రాకపోయినా, మీ చుట్టు పక్కల ఉన్న వాళ్లు ‘అలీ గురించి ఒక కామెంట్ చేయండి. రాజమండ్రి కదా బాగుంటుంది’ అని చెప్పి ఉంటారు. మీరు వేరే ఏ జిల్లాలో నా గురించి కామెంట్ చేసినా, నేను స్పందించేవాడిని కాదు. ఎందుకంటే, చిరంజీవిగారు వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ, నా బాట నేనే వేసుకున్నా. నా బాటలో నేనే నడిచా, నాకు ఎవరి సపోర్ట్ లేదు. చెన్నై నాకు జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే, నేను ఈ స్థాయిలో ఉన్నా. నా వల్ల ఎవరైనా లాభం పొందారు తప్ప. నేను ఎవరి వద్దా చేయి చాపలేదు. నేను ఎవరినీ ఏమీ అడగలేదు.’’
‘‘అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయ పడ్డా’ అన్నారు. ఏ విధంగా సాయపడ్డారు? డబ్బిచ్చారా? నాకు సినిమా అవకాశాలు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా. నేను ఎవరి దగ్గరకు వెళ్లి, ‘అయ్యా నాకు సాయం చేయండి’ అని అడగలేదు. ఆ అల్లా దయ వల్ల చాలా బాగున్నా. ఒకవేళ అడిగే అవకాశం వస్తే, అప్పటికి అలీ ఉండడు. ఆకలితో చచ్చిపోతాను తప్ప. వెళ్లి అడుక్కోను. ఆ విషయం మీకూ తెలుసు. ఎవరి మనసు నొప్పించేలా.. నేను మాట్లాడను. కానీ, మీరు ఆ మాట అనడం బాధేసింది. వైసీపీలోకి వెళ్లడం తప్పేంటి? రాజకీయ పార్టీలోకి వచ్చాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. నేను ఇప్పటివరకూ చాలా సభల్లో పాల్గొన్నా కానీ, ఎక్కడా మీ గురించి, మీ పార్టీ గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఎందుకంటే గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. మీకు నా గుండెల్లో స్థానమిచ్చా. కానీ, మీరు చాలా పెద్ద మాట మాట్లాడేశారు.’’