ఇండియా టుడే గ్రూప్ తాజాగా నిర్వహించిన పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (పీఎ్‌సఈ) మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో అత్యంత జనాదరణ గలిగిన నేతగా ఎవరిని గుర్తిస్తారని అడిగిన ప్రశ్నకు దక్షిణాది ప్రజల్లో 51 శాతం మంది రాహుల్ గాంధీ పేరు చెప్పారు. నరేంద్ర మోదీకి 39 శాతం మందే ఓటేశారు. మిగిలిన నేతలు- మాయావతి, మమత లాంటి వారు తదుపరి స్థానాల్లో ఉన్నారు. అదే ఉత్తరాదిలో తీసుకుంటే మోదీ పాప్యులారిటీ 55 శాతం పైనే ఉంది. రాహుల్ 31 శాతం దగ్గరున్నారు. ఇవే ఫలితాలు సీ ఓటర్, ఫస్ట్ పోస్ట్-ఐఎ్సపీఓఎస్ సర్వేలోనూ, ది హిందూ-లోక్‌నీతి సర్వే(ప్రభుత్వ పాపులారిటీ) లోనూ కూడా ప్రస్ఫుటమయ్యాయి. భారతావని కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వైపులా విస్తరించిన ఉపఖండం. కానీ బీజేపీకి మాత్రం ఎప్పుడూ ఉత్తరాది వారే కనిపిస్తారని రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. అంతేకాదు- ఏ రంగంలో చూసుకున్నా దక్షిదాది రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగుతూనే వచ్చింది. అందుకే 2017, 2018లో దక్షిణాది రాష్ట్రాల అగ్రనేతలు నిరసనగళం వినిపించారు. వీరిలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ ప్రముఖంగా నిలిచారు.
తమిళనాడులో అయితే ఏకంగా- 1960ల నాటి ‘‘ద్రవిడ నాడు’’ ఏర్పాటు డిమాండ్ మళ్లీ తెరపైకొచ్చింది. స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత్ రెండుగా చీలింది. ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉన్న, ధనికప్రాంతమైన దక్షిణాది ఒకవైపు... పేదరికంలో మగ్గే, యువ ఉత్తరాది మరోవైపు నిలిచాయి. ఉత్తరాది ప్రాంతమంతా ఓ రకంగా దక్షిణాది కట్టే పన్నుల మీద ఆధారపడుతోందన్నది నిపుణుల మాట. సిద్ధరామయ్య మాటల్లో చెప్పాలంటే... ‘‘ఉత్తరప్రదేశ్ ఒక రూపాయి పన్ను కడితే రూ.1.79 పైసలు ఆ రాష్ట్రానికి తిరిగి వస్తోంది. కర్ణాటక రూపాయి కడితే తిరిగి వస్తున్నది 47 పైసలు మాత్రమే!
సమస్యల్లా.. దక్షిణాది నిధులు సమకూరుస్తుంది. ఉత్తరాది సమస్యల్ని తీరుస్తుంది. కానీ రాజకీయ అధికారం మాత్రం ఉండదు. పెత్తనమంతా ఉత్తర భారత్‌దే! ఇది చాలా దక్షిణ రాష్ట్రాలకు మింగుడుపడడం లేదు. అందుకే అసంతృప్తి స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా పదిహేనో ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. రాష్ట్రాలకు పన్ను వాటా కేటాయింపుకు సంబంధించి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటామని కమిషన్ చెప్పడం నిరసనకు దారితీసింది. జనాభా అదుపులో పకడ్బందీగా వ్యవహరించిన దక్షిణ రాష్ట్రాలకు ఇది దెబ్బే. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు జనాభా అదుపులో విఫలమయ్యాయి. దక్షిణాదిని దెబ్బతీసే చాలా టర్మ్స్ అందులో ఉన్నట్లు ఆరోపణ. ఈ అసంతృప్తి మోదీ సర్కార్‌పైకి మారింది. కేంద్రం కూడా దీన్ని తగ్గించే ప్రయత్నాలేవీ చేయకపోవడం ఆయన పాపులారిటీని దిగజార్చింది.