రోజా పేరు వినగానే ఒకప్పుడు వెండి తెరమీద ఆమె రూపం గుర్తుకొచ్చేది. ఇప్పుడు మాత్రం ఆమె వ్యవహారశైలి గుర్తుకొస్తోంది. సినీతారగా ప్రేక్షకులను అలరించిన రోజా, రాజకీయ నాయకురాలిగా మాత్రం వివాదాలతో ప్రజలను హడలెత్తిస్తున్నారు. ఆమె ఎక్కడుంటే అక్కడ ఒక వివాదం భగ్గుమంటుంది. అసెంబ్లీలో అనేక వివాదాలు, ఆందోళనలతో వార్తల్లోకెక్కిన రోజా, నగరి సమస్యలపై మాత్రం అసెంబ్లీలో పోరాడలేదనే విమర్శలను మూటగట్టుకున్నారు. తనను గెలిపించిన నగరి ప్రజల సమస్యల పరిష్కారం కన్నా ఎక్కువగా ఆమె అధికార పార్టీ నేతలపై తిట్ల దండకానికే ప్రాధాన్యం ఇస్తారనే అపప్రధను మోయాల్సివస్తోంది. నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమె ఏదో ఒక వివాదానికి కేంద్రం అవుతున్నారు. బూతులు, తిట్లు, బెదిరింపుల వ్యవహారశైలితో ప్రశాంత నగరి ప్రాంతాన్ని ఉద్రిక్త నగరిగా మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రోజా కేంద్రంగా నడిచిన వివాదాలు ఇవీ..
నగరి గంగమ్మ రోడ్డుపాలు
2014లో నగరి గంగజాతర సందర్భంగా ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు అప్పట్లో తీవ్ర వివాదం అయింది. 2014 సెప్టెంబరులో నగరి గంగ జాతర జరిగింది. జాతరలో ఎమ్మెల్యే హోదాలో తొలి హారతి తనకే ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. నిజానికి సంప్రదాయం ప్రకారం గ్రామపెద్దకే తొలి హారతి ఇస్తారు. ఆమె డిమాండ్‌ను నిర్వాహకులు తిరస్కరించారు. దీంతో ఆమె వైసీపీకి చెందిన తన మద్దతుదారులను పోగేసుకుని జాతరను అడ్డుకున్నారు. 2017లో పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో ఓ సమావేశం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆరోపిస్తూ రోజా కార్యాలయం వెలుపల ఽబైఠాయించారు. వైసీపీ కార్యకర్తలతో కలసి ధర్నా చేపట్టారు. ఒక పోలీసు అధికారి సమూహంలో నిలబడి ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, ఆయన మీద ఆమె విరుచుకుపడ్డారు. దూరంగా నిలబడి ఆయన మాట్లాడడాన్ని అధిక్షేపిస్తూ, ‘ నేనేం ఎస్సీ కాదు, అంటరానిదాని లాగా దూరంగా నిలుచుని మాట్లాడతావేం’ అన్నారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోజా పట్ల నగరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా దళిత సంఘాలు విరుచుకుపడ్డాయి. రోజా వ్యాఖ్యల వల్ల వైసీపీ కూడా అప్రతిష్టను మోయాల్సి వచ్చింది.
నగరిలో వందలాది జనం మధ్యే ఎమ్మెల్యే రోజా ఓ పోలీసు అధికారిపై బూతు పురాణం విప్పారు. 2018లో నగరిలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. అక్కడికి సమీపంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రోజా అనుచరులను వెంటేసుకుని ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు కూడా తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. అక్కడి పోలీసు అధికారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. చివరికి రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో కూడా రోజా వ్యవహార శైలి వివాదాస్పదమే. అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన స్పీకరును కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలతో నొప్పించారు. సాటి మహిళా ఎమ్మెల్యే పట్ల కూడా అసభ్యంగా వ్యవహరించి అపకీర్తిపాలయ్యారు. ఈ పరిణామంతో రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచీ సస్పెండ్ చేస్తూ స్పీకరు ఆదేశాలిచ్చారు.