ఓటమి భయంతో వైసీపీ వీలైనన్ని కుట్రలకు తెగబడుతోంది. తమకు గిట్టనివారిపై నిస్సిగ్గుగా దుష్ప్రచారానికి తెగబడుతోంది. సొంత మీడియాను అడ్డం పెట్టుకుని తాజాగా వైసీపీ ఓ సరికొత్త హైడ్రామాకు తెరలేపింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు మధ్య ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా సంభాషణ జరిగినట్టు అవాస్తవ ప్రచారానికి ఒడిగట్టింది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ఈ పన్నాగం పన్నినట్టు తేలింది. జగన్ సొంత మీడియా సంస్థ సాక్షిని అడ్డం పెట్టుకుని వైసీపీ చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఖండించారు. వైఎస్ ఆరోగ్యశ్రీని మించిన పథకం పెట్టాలనుకున్నామని, అందులో ఒక సూచనగా ఆర్కేగారు ఆరోగ్యశ్రీకి మార్పులు చేసి మెరుగుపర్చాలని చంద్రబాబుకు సూచించారని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ పేరు మార్చమనే ఉద్దేశంతో చెప్పలేదని, సాక్షి ఛానెల్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని లంకా దినకర్ మండిపడ్డారు. వెయ్యికి పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చామని ఆయన తెలిపారు. తమ పార్టీ తరపున ఏ పనిచేసినా ఎన్టీఆర్ ఆశీస్సులతోనే చేస్తామని, దురుద్దేశం ఉంటే అన్న క్యాంటీన్లు అని ఎందుకు పెడతామని దినకర్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం పెట్టామని, ఎన్టీఆర్ స్పూర్తితోనే టీడీపీ నడుస్తోందని ఆయన చెప్పారు. వైఎస్, చంద్రబాబు సమకాలికులని, వైఎస్‌ని అంటే ఎన్టీఆర్‌కు ఎలా ఆపాదిస్తారని లంకా దినకర్ నిలదీశారు.