‘‘జగన్కు ఓటెయ్యమని ఒగటే సతాయిస్తా ఉండారు. సెంద్రబాబే నాకు పింఛనిస్తా వుండాడు.. అక్కడే ఓటేస్తానంటే ఇననే లేదోల్లు. రేత్తిరి తెలుగుదేశమోల్ల ప్రెచారానికి ఎల్లొస్తే, నువ్వు మా ఇంట్లోనే ఉండొద్దని తరిమేసినారు. ఆ రేత్తిరికాడ తట్టాబుట్టా ఎత్తుకొని నడీదిలో నిలబడాల్చొచ్చుండాది’’ అంటూ ఆ ఒంటరి మహిళ తీవ్ర ఆవేదనకు గురయింది. ఆమె ఎప్పటినుంచో టీడీపీ అభిమాని. ఆమె ఉంటున్న ఇంటి యజమాని వైసీపీ మద్దతుదారు. ‘చేస్తే వైసీపీకి ప్రచారం చెయ్.. లేదంటే ఇల్లు ఖాళీ చేసేయ్’ అనడంతో, చేసేది లేక కట్టుబట్టలతో నడిరోడ్డు మీదకు వచ్చేసింది. ఇంత కష్టపడుతూ కూడా, పార్టీ జెండా మాత్రం మార్చేది లేదని తెగేసి చెబుతోంది. చంద్రన్న ఇస్తున్న రెండువేల పింఛనుతో ఎక్కడైనా బతగ్గలనని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఈ దారుణంపై బాధితురాలి కథనం...
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నడింపల్లె గ్రామానికి చెందిన వసంతమ్మ(48) ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమెను భర్త 25 ఏళ్ల క్రితం వదిలేసిపోయాడు. వారికి పిల్లలు లేరు. రెండేళ్లుగా చిన్న అద్దె ఇంట్లో ఉంటూ, కూలి చేసుకొని బతుకుతోంది. చంద్రబాబు అంటే ఆమెకు అభిమానం. ఇది తెలుసుకొని వైసీపీ మద్దతుదారు అయిన ఇంటి యజమాని కొన్నాళ్లుగా ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. జగన్కు ఓటెయ్యమని, వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొమని ఒత్తిడి తెస్తున్నాడు. అయినా, ససేమిరా అన్న వసంతమ్మ, టీడీపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటోంది. ఎప్పటిలాగే, ఆదివారం రాత్రి కూడా, ప్రచారంలో రాత్రి పది గంటల దాకా ఆమె పాల్గొని, ఇంటికి వచ్చింది. ప్రచారం కోసం ధరించిన టీడీపీ టోపీ, కండువాలతో అలాగే ఇంటికొచ్చిన వసంతమ్మని చూడగానే ఇంటి యజమాని భగ్గుమన్నాడు.
వాటిని తీసి, దూరంగా విసిరేసి వొస్తే తప్ప ఇంట్లోకి రానిచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఇదే తీరులో టీడీపీవైపు ఉంటానంటే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేశాడు. వసంతమ్మ ఈ మాటలతో తీవ్రంగా కలత చెందింది. అర్ధరాత్రి వేళ తన వస్తువులను తీసుకుని నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు.. వసంతమ్మకు తాత్కాలికం గా వసతి ఏర్పాటు చేశారు. ఇంత జరిగినా వసంతమ్మలో రవ్వంత జంకూ కనిపించడం లేదు. చంద్రన్నను కాదన్నవా రి ఇంట్లో తానుండటం అవమానంగా ఉందని ఆవేదనతో పలికింది.