బీఎస్పీ అధినేత్రి మాయవతి పై అభిమానాన్ని చాటుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ పర్యటనకు వచ్చిన మాయావతికి స్వాగతం పలికిన జనసేనాని.. ఆమెకు పాదాభివందనం చేశారు. మంగళవారం (02-04-2019) విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఈ అరుదైన సన్నివేశానికి వేదికయ్యింది. ఎన్నికల పొత్తులో భాగంగా ఏపీలో బీఎస్పీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు మాయావతి ఏపీకి వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి మాయావతి కాన్వాయ్ బయటికి వస్తున్న సమయంలో ఆమెను కలిసిన పవన్ కల్యాణ్.. నమస్కరిచారు. తర్వాత మాయవతి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి మాయావతి బయల్దేరి హోటల్‌కు వెళ్లిపోయారు.
బుధవారం విశాఖ నుంచి మాయవతి పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. ముందుగా పవన్‌తో కలిపి మీడియా సమావేశానికి హాజరై.. తర్వాత విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. గురువారం, శుక్రవారం (4,5 తేదీలు) వరుసగా బహిరంగ సభలకు హాజరవుతారు. దళితుల ఓటు బ్యాంక్ చీల్చడం కోసం తాను ఈ పని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసేవారు.. గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. వాళ్లు విమర్శించేది నన్నే కాదు.. జాతీయ స్థాయి నాయకురాలు మాయావతిని కూడా అని పవన్ వ్యాఖ్యానించారు.
2008లో బీఎస్పీ అధ్యక్ష పదవి ఇస్తామని తనకు ఆఫర్ చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ అన్నయ్య చిరంజీవి పార్టీ ఏర్పాటు చేయడంతో కాదన్నానని పవన్ తెలిపారు. నాపై విమర్శలు చేసేవారికి ఈ విషయం వారికి తెలియదని, తెలిసినా బయటకు చెప్పరని జనసేనాని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకోలేదన్నారు. కాపులు కేవలం ఒకట్రెండు జిల్లాల్లోనే అధిక సంఖ్యలో ఉన్నారన్న ఆయన.. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఒకే సామాజిక వర్గాన్ని నమ్ముకొని ముందుకెళ్లదన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ప్రధాన సమస్య, రాయలసీమలో నీటి సమస్య ఉంది. సీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు వచ్చారు. కొన్ని రాజకీయ కుటుంబాలే రాజకీయాలను నియంత్రిస్తున్నాయని విమర్శించారు.