తనయుల గెలుపు కోసం తండ్రులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. తొలిసారిగా తనయులు ఎన్నికల బరిలో దిగడంతో వారిని గెలిపించుకోవడానికి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే కుమారుడు జేసీ అశ్మిత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు అధికార టీడీపీ తరపున బరిలోకి దిగడంతో వారి గెలుపును తండ్రులు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇరువురు అభ్యర్థులు రాజకీయాలకు కొత్తకాకున్నా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గెలుపే ధ్యేయంగా తండ్రులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. జేసీ బ్రదర్స్ తమ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి పావులు కదుపుతున్నారు.
ఒకవైపు ఎండలు మండుతున్న, అనారోగ్య పరిస్థితులు బాధపెడుతున్న పట్టించుకోకుండా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మెజార్టీ వస్తే ఎంపీ అభ్యర్థికి మంచిదన్న అలోచనతో ఎమ్మెల్యే జేసీ ప్రత్యేక దృష్టి నిలిపారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రచారానికి పదును పెంచారు. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మిత్‌రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రచారానికి వెళుతున్నారు. కులాల వారిగా ఓట్లను సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు రాత్రి సమయాల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలోని పలువురు నాయకులను కలుసుకుని చర్చలు జరుపుతున్నారు. టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కీలక నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ హామీలను గుప్పిస్తున్నారు. అసంతృప్తులపై కూడా దృష్టి పెడుతున్నారు. చిన్నపాటి మనస్పర్థలు, స్థానిక కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న నాయకులను కలుసుకుని బుజ్జగిస్తున్నారు. జేసీ మంత్రాం గం వల్ల నియోజకవర్గంలో పలుచోట్ల అసంతృప్తులు చల్లబడ్డారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారితో సైతం లోపాయికారి మద్దతు కూడగట్టుకునే ప్ర యత్నం చేస్తున్నారన్నా ప్రచారం ఉంది. వీరి కోసం మండలస్థాయి నాయకులు, బంధువులను వలవేస్తున్నారని తెలుస్తోంది.