ఒకరికి ఒక ఓటే ఉండాలన్నది రూలు! కానీ.. ఘనత వహించిన మన ఎన్నికల అధికారులు.. కొందరు ఓటర్ల పేరు మీద ఒకటికి మించిన ఓట్లు ఇచ్చేశారు!! వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి పేరుతో రెండు ఓట్లు.. ఆయన సోదరి షర్మిల పేరుతో రెండు ఓట్లు ఉండగా.. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో మూడు ఓట్లు ఉన్నాయి!! విశాఖలో ఒక ఓటరు పేరుతో అయితే ఏకంగా తొమ్మిది ఓట్లున్నాయి! ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనపడుతున్నారు. జగన్‌ ఇలాకా పులివెందులలో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనపడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. జగన్‌ కుటుంబసభ్యుల్లోనే ఇద్దరికి రెండేసి చొప్పున ఓట్లు ఉండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఆయన కుమార్తె హర్షిణి రెడ్డి యడుగూరి సందింటి పేరుతో వేర్వేరు ఓటర్‌ ఐడీ నంబర్లతో రెండు ఓట్లున్నాయి. ఈ రెండూ ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్‌ అప్‌డేట్‌ చేసిన జాబితాలోనివే.

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణంలో నివాసం ఉంటున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పేరు మీద 3 చోట్ల ఓట్లు నమోదయ్యాయి. ఈసీ ఇటీవల విడుదల చేసిన తాజా సవరణ 2019, చేర్పులు - తొలగింపులతో కూడిన అనుబంధం -2 ఓటరు లిస్టులో క్రమసంఖ్యలు 1397, 1398, 1399ల్లో వరుసగా ఆయన ఓట్లే ఉన్నాయి. మరోవైపు, విశాఖ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారులు ఇటీవల కొత్త ఓటర్ల జాబితాను పరిశీలించగా.. సీరియల్‌ నంబర్‌ 703 నుంచి 711 వరకూ ఆరిలోవకు చెందిన తాటికూరి మణికొండ అనే యువకుడి పేరు, ఫొటో ఉన్నట్టు బయటపడడంతో ఆశ్చర్యపోయారు. విశాఖ జిల్లాలో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇవే కాదు.. ఒక పోలింగ్‌ బూత్‌ పరిధిలోనివారికి వేరే పోలింగ్‌బూత్‌ పరిధిలో ఓట్లు ఉండటం, ఒక ఇంట్లో కొన్ని ఓట్లు ఉంటే.. మరికొందరివి లేకపోవడం వంటి అవకతవకలు చాలానే జరిగాయి.

ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లనే ఇన్ని తప్పులు దొర్లాయని సమాచారం. అయితే, ఎన్ని పొరపాట్లు జరిగినా.. తుది ఓటరు లిస్టు విడుదల చేసేటప్పుడు మార్పులు, చేర్పులు చూసుకొని ఓటరు లిస్టులు విడుదల చేయాల్సి ఉంది. అలాంటిది సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేరే ఓటరు జాబితాలో మూడుసార్లు ఉండడం చూస్తుంటే సామాన్యుల విషయంలో ఇంకెన్ని అవకతవకలు జరిగాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాడేపల్లి పట్టణ మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.వి.పద్మావతిని వివరణ కోరగా.. ఓటు కోసం ఎక్కువసార్లు దరఖాస్తు చేయడం వలన ఇలాంటి పొరపాట్లు జరిగాయని, ఎన్నికలు జరిగేనాటికి పోలింగ్‌ కేంద్రానికి మార్పులు చేసిన ఓటరు లిస్టును పంపిస్తామని ఆమె తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read