టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు రోడ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే విమర్శనాస్త్రాలు గురిపెట్టారు. పోలవరం ప్రాజక్టును ఏటీఎంగా మార్చుకుని కేంద్రం నుంచి నిధులు పిండుకుంటున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు దీటుగా బదులిచ్చారు. "పోలవరం మనకందరికీ ఏటీఎం అంట! అసలు ఏటీఎంల్లో డబ్బులే లేవు. పోలవరంలో కూడా డబ్బుల్లేవు. రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వట్టిపోయిన ఏటీఎంగా మార్చేశారు. పోలవరం పూర్తిచేయడం నరేంద్ర మోదీకి ఇష్టంలేదు. అనేక అడ్డంకులు సృష్టించాడు. నేనిప్పుడు హామీ ఇస్తున్నాను, డిసెంబరు లోపల ప్రాజక్ట్ పూర్తవుతుంది. మోదీ, కేసీఆర్, జగన్... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి! నా సత్తా ఏంటో చూపించి పోలవరం పూర్తిచేస్తాం.

polavaram 01042019

ఇప్పుడు చెబుతున్నా.. పోలవరం అంటే 'ఏటీఎం' కాదు... యస్.. పోలవరం అంటే 'ఏటీడబ్ల్యూ'. 'ఏటీడబ్ల్యూ' అంటే ఎనీ టైమ్ వాటర్ ఇన్ ద స్టేట్. ఒక బటన్ ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలనుకుంటే ఆ ఊరికి నీళ్లు వెళతాయి. కరెంటు మాదిరిగా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాదే. ఎక్కడ కుళాయి తిప్పినా నీళ్లే. 24×7 నీళ్లు తెప్పిస్తా. గుజరాత్ లో మీరు చేయలేకపోయారు, నేనిక్కడ చేస్తున్నా, అదే మీకు కుళ్లు" అంటూ మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు తంబళ్లపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఐదేళ్లు నేనెలా పరిపాలించాను, నువ్వెలా పరిపాలించావు? నీ పాలనలో దేశంలో ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగాలు పోయాయా? లేదా? ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందా? లేదా? ఆదాయం రెండింతలు చేస్తామన్నారు, ఎక్కడైనా వచ్చిందా?

polavaram 01042019

కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదాయం 128 శాతం పెంచిన ఏకైక ప్రభుత్వం మనదే. తిరుపతి సభలో నదుల అనుసంధానం చేస్తామని చెప్పారు, చేశారా మరి? మేం చేశాం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి చూపించాం. పోలవరం మన జీవనాడి, అదేదో ఈయనిచ్చినట్టుగా చెబుతున్నారు. జాతీయ ప్రాజక్ట్ అని, అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నరేంద్ర మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.మోదీకి ఓ ముని శాపం ఉంది, నిజం చెబితే తల వెయ్యి వక్కలైపోతుంది. అందుకే మోదీ ఒక్క నిజం కూడా మాట్లాడరు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అమరావతిని చూస్తే మోదీకి కడుపు మండిపోతోందని అన్నారు. ఆయన అహ్మదాబాద్ కంటే మన అమరావతి మించిపోవడం మోదీకి నచ్చడంలేదని తెలిపారు. "నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నమ్మకద్రోహి. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదా కోసం 29 సార్లు తిప్పుకున్నాడు. నాకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చి నాకే కథలు వినిపిస్తున్నాడు. నేను 95లో ముఖ్యమంత్రి అయితే, 2002లో వచ్చాడీ మోదీ. అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారు మీరు, అందుకు మాకేం బాధలేదు. కానీ ఆంధ్ర ప్రజలను కించపరిస్తే సహించేదిలేదు. మీ బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. మీ స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి. మీ దగ్గరున్న డిపార్ట్ మెంట్లను మాపై ప్రయోగించి ఊడిగం చేయించుకోవాలనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. మీకు ఊడిగం చేయాలనుకుంటే... ఉన్నాడు జగన్!" అంటూ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read