ఎన్నికలకు ముందునుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం మరో వివాదానికి తెరతీశారు. సరిగ్గా చంద్రబాబు చంద్రగిరిలో ప్రచారం చేస్తున్నారు అనే ఒక రోజు ముందు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం తెప్పించారు. టీడీపీ బలంగా ఉన్న ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్లి, గ్రామస్తులతో వివాదానికి కాలుదువ్వారు. రాత్రి పొద్దుపోయేవరకు తన మంకుపట్టు వీడలేదు. చంద్రగిరి మండలంలో టీడీపీకి గట్టి పట్టున్న ముంగిలిపట్టు గ్రామంపై చెవిరెడ్డి కన్నేశారు. గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించే ఆదే గ్రామానికి చెందిన దామోదరనాయుడు అనే వ్యక్తిని వెంటపెట్టుకుని సోమవారం మధ్యాహ్నం అక్కడికి ప్రచారానికి వెళ్లారు. దీంతో ముంగిలిపట్టు గ్రామస్తులంతా ఒక్కటై చెవిరెడ్డి గోబ్యాక్ అంటూ నినదించారు. ఆ వ్యక్తిని (దామోదరనాయుడు) పక్కనపెట్టి.. తమ గ్రామంలో ప్రచారం చేసుకోవాలని చెవిరెడ్డికి సూచించారు.
అయితే గ్రామస్థుల మాటను పెడచెవినపెట్టి ఆ వ్యక్తితోనే ప్రచారం చేసేందుకు చెవిరెడ్డి బయలుదేరడంతో ప్రచారం చేయనీయమని గ్రామస్తులు వ్యతిరేకించారు. చెవిరెడ్డి భీష్మించుకు కూర్చోవడమే కాక కాసేపటికి ఇతర మండలాల నుంచి వైసీపీ కార్యకర్తలు ఆ గ్రామానికి తరలి రావడంతో ముంగిలిపట్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా ప్రచారం చేసుకోమని కోరగా, ఇలా గ్రామంలో ఉద్రిక్తతలు రేపడాన్ని గ్రామస్థులు తప్పుపడుతున్నారు. చెవిరెడ్డికి, గ్రామస్థులకు తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరడంతో పారామిలటరీ బలగాలతో పోలీసు ఉన్నతాధికారులు భద్రత చర్యలు చేపట్టారు.
మరోవైపు టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి అతని అనుచరులు దాడికి దిగారని సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గ్రామానికి చేరుకుని గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని పోలీసులను అభ్యర్థించారు. గ్రామస్థులకు సర్దిచెప్పి ఎటువంటి గొడవలు జరగకుండా సముదాయించి ప్రజాస్వామ్యం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఇక్కడినుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించి గ్రామంనుంచి వెళ్లిపోయారు. అప్పటికే సుమారు మూడు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగడంతో పోలీసులు క్షణక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. తన అనుచరులతో కలసి ముంగిలిపట్టులోనే బైఠాయించిన చెవిరెడ్డి రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్లిపోయారు. ఊరిలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ దళిత మహిళలచేత ఫిర్యాదు చేయించారు.