చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ఈ కేసును వేశారు. మోహన్ బాబుకు జైలు శిక్ష పడిందనే వార్త సంచలనం రేపుతోంది. మరోవైపు దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'కొన్ని టీవీ చానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా' అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఒక పక్క టీవీల్లో కోర్ట్ నుంచి వార్తలు చెప్తుంటే, అవి నమ్మకండి అంటూ, మోహన్ బాబు ఎందుకు ట్వీట్ చేసారో అర్ధం కాలేదు. అంటే టీవీ చానల్స్ అన్నీ తప్పుడు వార్తలు వేసాయా ? కోర్ట్ చెప్పింది కూడా నిజం కాదా ? మోహన్ బాబు ఎందుకు ఇలా ట్వీట్ చేసారు ?
మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.. రూ.40లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారణ జరగ్గా, మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50లక్షల చెక్కును మోహన్‌బాబు దర్శకుడికి అందించారు.
అయితే, ఆ చెక్ నగదుగా మారకపోవడంతో వైవీఎస్ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజులు బౌన్స్ అయిన నగదును దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. నెలరోజుల లోపు చౌదరికి ఇవ్వాల్సిన రూ. 48 లక్షలు చెల్లించేస్తే ఈ కేసు కొట్టివేయడం జరుగుతుంది.