సార్వత్రిక సమరంలో గెలుపు మాదేనన్న ధీమా ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. పోటీలో ఉన్న జనసేన, కాంగ్రెస్, బీజేపీ స్వతంత్రులు ఎవరి గెలుపుకు గండి పెడతారోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని ఈసారి గెలుపుకు, వ్యూహ ప్రతివ్యూహాలకు నేతలు పదను పెడుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలించే అంశాలు చాలానే ఉన్నాయని, అందుకే మెజార్టీ స్థానాల్లో గెలుపు మాదేనని టీడీపీ వర్గాలు ధైర్యం వ్యక్తం చేస్తున్నాయి. సానుభూతి పవనాలు, ఓ సామాజిక వర్గం మద్దతు తమకే ఉన్నాయని, పట్టుకు ఎలాంటి ఢోకా లేదని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 133 మంది ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం ఒక్కటే టీడీపీకి దక్కింది. మిగిలిన తొమ్మిది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటిలో కడప, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు 30 వేల నుంచి 75వేల మెజార్టీ సాధించారు. రైల్వేకోడూరు నుంచి 1972 ఓట్లు, కమలాపురం నుంచి 5345 ఓట్లు అతి స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు ఆ స్థానాలు వదులుకోవాల్సి వచ్చింది. జమ్మమలడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 9 వేల నుంచి 12వేల ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అ భ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఆనాటి ఎన్నికల్లో టీడీపీ నేతలు మరింతగా కష్టపడి ఉంటే ఫలితాలు తారుమారు అయ్యేవి. అందుకనే ఈసారి టీడీపీ నేతలు గత ఫలితాలను విశ్లేషించుకుంటూ ఆ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో నడుస్తున్నారు. ప్రతిఇంటికి సంక్షేమం, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలుగా వారు పేర్కొంటున్నారు.
2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆ ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితులు. కారణం.. వైఎస్ సానుభూతితో పాటు జగన్ సీఎం అవుతారని ఆలోచనతో ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. అయినా ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ గట్టిపోటీ ఇచ్చింది. దీంతో ఈ పర్యాయం ఇక్కడ గెలుపొందే అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు తమకు సానుభూతి పవనాలు చెక్కుచెదరలేదని, జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం తమవైపే ఉందని, ఈ సారి పట్టు సాధించుకుంటామంటున్నారు. పది నియోజకవర్గాల్లో 133 మంది ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభావం పెద్దగా లేకపోయినా జనసేన ప్రభావం మాత్రం రాజంపేట, రైల్వేకోడూరులలో కొంత ఉందని ప్రచారం సాగుతోంది. ఈసారి ఎవరు గెలిచినా భారీ మెజార్టీ అన్నది ఉండదు. స్వల్ప ఆధిక్యంతోనే గెలుస్తారని సమాచారం. దీంతో స్వతంత్రులు, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల ప్రభావం ఎవరిపై పడుతుందోనన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.