ఓవైపు ఓటమెరుగని జేసీ కుటుంబం.. మరోవైపు రాజకీయానుభవమే లేని మాజీ అధికారి.. అనంతపురం లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. 40 ఏళ్ల అనుభవజ్ఞుడు.. జిల్లాలో రాజకీయ చాణక్యుడిగా పేరొందిన టీడీపీ సిటింగ్ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. విశ్రాంతి తీసుకుని ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగారు. సీఎం చంద్రబాబు అనుమతితో తన వారసుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఈ దఫా ఆయన్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. టీడీపీకి అండగా ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో బోయ వర్గానికి చెందిన డీఆర్డీఏ మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో జేసీ రాజకీయ నైపుణ్యానికి ఈ పోరు పరీక్షగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కంచుకోటే అయినా.. తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట. అయినప్పటికీ అనంతపురం పార్లమెంటు బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులు గతంలో చాలాసార్లు ఓటమి చవిచూశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984 నుంచి తొమ్మిదిసార్లు ఈ సీటుకు ఎన్నికలు జరిగాయి. కేవలం మూడు సార్లు మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 1984లో డి.నారాయణస్వామి, 1999లో కాల్వ శ్రీనివాసులు, 2014లో జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీ తరఫున గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో జేసీ తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ఇక్కడ బరిలోకి దించారు. గత ఎన్నికల్లో జేసీ ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు.
కానీ వైసీపీ అభ్యర్థి, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనంత వెంకట్రామిరెడ్డిని 61 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తలారి రంగయ్య స్థానికేతరుడు. కర్నూలు జిల్లా వాసి. కానీ అనంతపురం జిల్లాలో సుదీర్ఘ కాలం పనిచేశారు. అనంతపురం, హిందూపురం మున్సిపల్ కమిషనర్‌గా.. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. జగన్‌పై ప్రజాదరణే తనను గట్టెక్కిస్తుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. జనసేన కూటమిలో భాగంగా సీపీఐ నుంచి జిల్లా కార్యదర్శి జగదీశ్ పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి దేవినేని హంస, కాంగ్రెస్ తరఫున రాజీవ్‌రెడ్డి బరిలో ఉన్నా.. వీరి ప్రభావం అంతంత మాత్రమేనని భావిస్తున్నారు.