ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పదవి నుంచి సునీల్ అరోరా తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ డిమాండ్ చేశారు. తమకు కేటాయించిన హెలికాప్టర్ గుర్తును కర్నూలులో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులకు కేటాయించారని మండిపడ్డారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థుల బీ ఫారాలను ఎత్తుకెళ్లారని, సంతకాలను సైతం ఫోర్జరీ చేసి వేరే వారికి సీట్లు కేటాయించారని తెలిపారు. వీటితో పాటు ఆళ్లగడ్డలో తమ అభ్యర్థికి వీణను కేటాయిస్తే ఎన్నికల సంఘం నిద్రపోతోందా అని నిలదీశారు. ఆయన నివసిస్తున్న హోటల్లో గదులు ఖాళీగా ఉన్నా సరే లేవంటూ మూడు నెలలుగా లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తమ పార్టీకి ప్రజల్లో వస్తోన్న ఆదరణను చూసే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తమకు కేటాయించిన గుర్తును టీడీపీ, వైసీపీ మద్దతుదార్లకు సైతం కేటాయిస్తున్నారని, అసలు ఈ ఎన్నికలను రద్దు చేయాలని పాల్ డిమాండ్ చేశారు. జగన్, విజయసాయి రెడ్డి తనపై అనేక కుట్రలు చేస్తున్నారని, తనపై అనేక ఒత్తిడులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీకి, జనసేనకి ఓటువేస్తే ప్రజలను దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు. వాళ్లిచ్చే తాయిలాలకు లొంగకుండా ఆయన పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు, జగన్ ప్రజాధనాన్ని దోచుకున్నారని, గుండుగీసే నాయకులు కావాలా? లేదా గుండె ధైర్యమున్న ఆయనలాంటి నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నా, స్పందన లేదని మండిపడ్డారు. కేవలం ఒక్క గన్మెన్ని పంపారని, తన ప్రాణాలంటే అంత చులకనా? అని మండిపడ్డారు. కేసీఆర్కు ఆంధ్రా రాజకీయాలతో ఏం సంబంధమని, ఆయన తెలంగాణను ఆయన చూసుకోవాలని ఆయన సూచించారు. అవినీతిపరుడైన జగన్తో సంబంధం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.