గుడివాడలో వైసీపీకి ఎదురేలేదని ఆ పార్టీ నేతలు ఇప్పటివరకు ప్రగల్బాలు పలుకుతూ వచ్చారు. దేవినేని అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించగానే కొడాలి నాని మెజార్టీ ఈసారి 20 వేలకు పెరుగుతుందని, ఉఫ్ అని ఊదేస్తామని బీరాలు పోయారు. కానీ అవినాష్ వచ్చిన దగ్గర్నుంచి గుడివాడ టీడీపీలో పరిణామాలు చకచకా మారిపోయాయి. అందరి అంచనాలు తారుమారయ్యాయి. వచ్చిన పదిరోజుల్లోనే అవినాష్ దూసుకుపోతున్నారు. చంద్రబాబు వార్నింగ్, సూచనలతో టీడీపీ యంత్రాంగం మొత్తం దాదాపుగా ఏకతాటిపైకి వచ్చింది. నానికి వ్యూహాల్లో గానీ, ఎత్తుగడల్లో కానీ ఎందులోనూ వీసమంత కూడా తగ్గేది లేదన్న అభిప్రాయాన్ని అవినాష్ అండ్‌కో పార్టీ కేడర్‌లో కలిగించింది.
రోజురోజుకు అవినాష్‌కు పెరుగుతున్న ఆదరణ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ స్పీడ్ వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఆ పార్టీ చేస్తున్న ప్రచారానికి కనీస స్పందన కూడా కనిపించడం లేదు. వైసీపీ ముఖ్య నేత వెంట తిరిగే నాయకులే ఈ ఎన్నికల్లో తమ పని ఖాళీ అనే అభిప్రాయానికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు పది రోజుల ముందే నాని వర్గం డీలా పడటం చూసి పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. కొడాలి నాని శిబిరంలో ఇలాంటి వాతావరణం నెలకొనడం ఇదే ప్రఽథమమంటూ వ్యాఖ్యలు వినవస్తున్నాయి. చేరికల పేరిట హడావుడి చేస్తూ కొడాలి నాని తన కేడర్‌లో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తు న్నాయి. తమ నుంచి ఒక్కరూ వైసీపీలోకి వెళ్లలేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎం చంద్రబాబు శుక్రవారం గుడివాడ అభివృద్ధికి ఇచ్చిన హామీలు ప్రజల్లో ఉత్సాహం నింపాయి. కీలకమైన ఔటర్‌రింగ్ రోడ్ ఏర్పాటుతో నలుదిశలా అడ్డంకులతో కుచించుకుపోయిన గుడివాడ పట్టణ పరిధి పెరిగే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. విజయవాడ- గుడివాడ రోడ్డును నాలుగు వరసలుగా మారుస్తామని హామీ ఇవ్వడాన్ని ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువులు అధికంగా ఉండే నందివాడ మండలంలో ఆక్వా హబ్ ఏర్పాటు, రవాణ రంగానికి ఊతమిచ్చేలా లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటుకు నిర్ణయాలు వెల్లడించడం వంటివి అభివృద్ధికి కీలక ముందడుగుగా పరిశీలకులు భావిస్తున్నారు. గుడివాడ అభివృద్ధికి తాను స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో వచ్చానని చెప్పిన దేవినేని అవినాష్ తొలి సభలోనే ముఖ్యమంత్రి వద్ద వాటిని ప్రస్తావించి ఆమోదముద్ర పొందడం విజయానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.